కోకాపేట భూములు ప్రభుత్వానివే!

హైదరాబాద్ నగర శివారులోని కోకాపేటలో వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారసత్వం విషయంలో  వివాదాస్పదంగా  మారిన 630 ఎకరాల భూములపై రాష్ట్ర ప్రభుత్వం,  హెచ్‌ఎండీఏకే సర్వహక్కులు  ఉన్నాయంటూ  తేల్చింది. నిజాం హయాంలో జాగీర్‌గా  వ్యవహరించిన నవాబ్ నుస్రత్‌జంగ్ బహాదుర్1కు చెందిన వారసులకే  కోకాపేట భూములపై  హక్కు ఉందంటూ వారి ప్రతినిధిగా కేఎస్‌బీ ఆలీ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను న్యాయమూర్తులు జస్ట్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్‌భూషణ్‌లతో  కూడిన ధర్మాసనం కొట్టివేసింది. దీంతో  నవాబ్ నుస్రత్ జంగ్ బహాదుర్ వారసులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొన్నేండ్లుగా ఉన్న వివాదానికి తెరపడినట్లయింది.

ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యాన్ని ఆసరా చేసుకొని కేఎస్‌బీ ఆలీ కోకాపేట భూములపై  కన్నేసి అప్పటి ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెట్టారు. ఈ వ్యవహారాన్ని  సీరియస్‌గా  తీసుకున్న  తెలంగాణ సర్కారు న్యాయస్థానంలో బలమైన వాదనలు చేసి.. వేల కోట్ల విలువ చేసే ల్యాండ్‌బ్యాంక్‌ను  హెచ్‌ఎండీఏ చేయిదాటకుండా  కాపాడింది. సుప్రీం తీర్పు  పట్ల  హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులుకు సంస్థ ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా  పరిధిలోకి వచ్చే  కోకాపేటలోని 109, 147, 117, 116, 114, 100, 239, 240 సర్వే నంబర్లలో దాదాపు 630 ఎకరాల భూములకు చాలా  చరిత్ర ఉంది.  నిజాం రాజు వద్ద జాగీర్‌గా  వ్యవహరించిన నవాబ్ నుస్రత్‌జంగ్ బహాదుర్ 1 తనకు అధికారాల ద్వారా  సంక్రమించిన కోకాపేటలోని 1632 ఎకరాల్లో సాగు చేస్తుండేవారు. ఆయనకు సంతానం కలుగలేదు. 1875లో నుస్రత్‌జంగ్ మరణించారు. అనంతరం కోకాపేట భూమిలో సాగు చేసే బాధ్యతను ఆయన భార్య  రహ్మత్‌ ఉన్నీసాబేగం ఇమాం ద్వారా తీసుకున్నారు. అదే సమయంలో నుస్రత్ సోదరులిద్దరూ  తమ అన్నకు సంతానం లేదు కాబట్టి.. కోకాపేట భూములు తమకే ఇవ్వాలంటూ  1906లో ఎంక్వైరీస్ పెట్టుకుంటే  నిజాం రాజు పక్కన పెట్టారు. భార్య  బతికి ఉన్నంతకాలం వారసత్వ  హక్కులను  నిర్ణయించకూడదని నాటి నిజాం ప్రభుత్వం ఆదేశించింది. 1916లో నుస్రత్ భార్య  కూడా  కన్నుమూశారు. తదనంతరం వారసులు లేని కారణంగా  ఆ భూమిని సర్ఫెఖాస్ ల్యాండ్ అంటే.. నిజాం సొంత భూములు గా అప్పటి నిజాం రాజు గుర్తించారు.  నిజాం అనంతరం 1948 ఆగస్టు 14న జాగీర్ రద్దు చట్టం,  1358 ఫస్లీ తీసుకొచ్చారు. దీని ప్రకారం నుస్రత్ భూమి అంతా  ప్రభుత్వానికే  చెందుతుంది.

అయితే 1952 ఆంధ్రప్రదేశ్  అతియాతి ఎంక్వైరీస్ చట్టం ప్రకారం సక్సెస్ రైట్ కింద నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించడంతో దాదాపు 100 మంది తాము నుస్రత్ వారసులమంటూ ముందుకొచ్చారు. వీరు ముంతకబ్ ప్రకారం ఇమాంలకు అనుగుణంగా  వచ్చే రూ. 3900లు తీసుకున్నారు. ఆ తర్వాత తకెట్ లు ఇవ్వలేదని ప్రభుత్వానికి విన్నవించడంతో అప్పటి రెవెన్యూ మంత్రి తకెట్‌ల పైసలు వస్తాయి.. భూమిపై హక్కులు లేవంటూ స్పష్టం చేశారు. అప్పటి నుంచి భూమిపై కన్నేసిన సుస్రత్ సమీప బంధువులు అసలు వారసులం మేమేనంటూ, ఆ భూమి హక్కులు మాకే చెందుతాయంటూ  1976లో సివిల్ కోర్డులో పిటిషన్ వేశారు. నష్ట పరిహారం చెల్లించవచ్చు కానీ భూమి ఇవ్వడానికి వీల్లేదని న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ పిటిషన్‌ను సవాల్ చేస్తూ సీసీఏ దాఖలు చేసినా, హైకోర్టు సైతం సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

కోకాపేట భూముల విషయంలో జాగీర్ రద్దు చట్టం ప్రకారం నష్టపరిహారం అడుగడానికి వీలున్నది కానీ.. భూమిని అప్పగించటానికి వీల్లేదని ప్రభుత్వం 2002లో  ఓ మెమో జారీ చేసింది. ఈ మెమోపై అప్పటి ప్రభుత్వం రెండు సార్లు తన వైఖరి మార్చుకొంది. 2002లో జారీ చేసిన మెమో తప్పుగా ఇచ్చామని, దాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు  హైకోర్టుకు 2004లో చెప్పిన ప్రభుత్వం.. ఏడాది తిరిగేసరికి ఆ మెమో సరైనదేనని భూములను తిరిగి ఇచ్చేది లేదని మరో  మెమోను జారీ చేసింది. దీంతో  కేఎస్‌బీ ఆలీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘంగా  విచారించిన సుప్రీంకోర్టు కేఎస్‌బీ ఆలీ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ  తీర్పును వెలువరించింది. జాగీర్ రద్దు చట్టం ప్రకారం 630 ఎకరాలు  హెచ్‌ఎండీఏకే  చెల్లుతాయంటూ  తీర్పునిచ్చింది. దీంతో నుస్రత్ జంగ్ వారసులమంటూ  దశల వారీగా  చేస్తున్న  పోరాటానికి ముగింపు పలికినట్లయింది.  హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మెంబర్ ఎస్టేట్ బీ రాజేశం, ఆయన బృందం గంగాధర్‌ల మార్గదర్శనంలో కోర్టుల చుట్టూ చక్కర్లు కొట్టి మరీ.. ఈ భూమి ప్రభుత్వానికే చెందేలా చేయటంలో కీలక పాత్ర పొషించారు.

రాష్ట్ర ప్రభుత్వం నిధుల సేకరణలో భాగంగా కోకాపేట ప్రభుత్వ భూముల నుంచి 630ఎకరాలను హెచ్‌ఎండీఏకు ఇచ్చింది. 2007లో ఈ భూములను వేలం నిర్వహించిన హెచ్‌ఎండీఏ వివిధ సంస్థలకు వాటిని విక్రయించింది. ప్రధానంగా గోల్డెన్‌మైన్ ప్రాజెక్టు పేరుతో  100 ఎకరాలు, ఎంపైర్-1, 2  పేరుతో  87 ఎకరాలు మొత్తం  187 ఎకరాల భూమిని వేలం ద్వారా విక్రయించింది. అప్పట్లో  విపరీతమైన రియల్ బూమ్ కారణంగా  ఎకరం ధర రూ.5 కోట్ల నుంచి 14  కోట్ల వరకు పలికింది. ఈ భూముల విక్రయం ద్వారా మొత్తం రూ.1755 కోట్లు ఆదాయం వస్తున్నట్లు అప్పట్లో  లెక్క తేలింది. వేలం పాటలో ఈ భూములు దక్కించుకున్న  15 సంస్థలు  రెండు వాయిదాల్లో రూ.687 కోట్లు చెల్లించాయి. ఈ మొత్తాన్ని  ప్రభుత్వ  ఖజానాకు హెచ్‌ఎండీఏ జమ చేసింది. ఆ తర్వాత రియల్‌బూమ్ పడిపోవడంతో భూములకు డిమాండ్ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కోకాపేట భూముల కొనుగోలు చేసిన సంస్థల్లో 14 సంస్థలు తాము వేలం పాటలో దక్కించుకున్న  భూములకు సంబంధించి యాజమాన్యపు హక్కుల వివాదం ఉందని తమకు చెప్పకుండా  హెచ్‌ఎండీఏ దాచి పెట్టిందనే సాకుతో తమ సొమ్మును  తిరిగి చెల్లించాలని హైకోర్టులో కేసు వేశాయి. వాదోపవాదాల ఆనంతరం కోకాపేట భూములు వివాదంలో ఉన్న విషయం తెలియజేయకుండా సదరు సంస్థలకు వేలం ద్వారా అప్పగించడాన్ని తప్పుబడుతూ ఆయా సంస్థలకు తిరిగి డబ్బు చెల్లించాలని సింగిల్ జడ్జి  2010లో ఉత్తర్వులు ఇచ్చారు.

సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ఎదుట హెచ్‌ఎండీఏ అప్పీళ్లు దాఖలు చేసింది. ఈ కేసును లోతుగా పరిశీలించిన దర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వులను తోసిపుచ్చింది. దీంతో  హెచ్‌ఎండీఏ మిగిలిన మొత్తాన్ని కూడా చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా  కోరుతూ ఆయా సంస్థలకు నోటిసులిచ్చింది. దీంతో ఆయా సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కోకాపేట భూములన్నీ ప్రభుత్వానివేనని, ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు తావు లేదని, కోకాపేట భూముల యాజమాన్యపు హక్కుల విషయంలో ఎటువంటి వివాదం లేదని సుప్రీంకు ఇప్పటికే పలు వాదనల్లో వినిపించింది. బహిరంగ వేలంలో ఈ భూములను కొనుగోలు చేసిన సంస్థలకు భూములను రిజిస్టర్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయినా ఆ సంస్థలు ముందుకు రావడం లేదని వివరించింది. టైటిల్ క్లియరెన్స్ తీర్పు అనుకూలంగా వచ్చినప్పటికీ వేలంలో పాల్గొన్న సంస్థలు వేసిన పిటిషన్లపై వచ్చే నెల 10న విచారణ ఉండటంతో ఉత్కంఠ నెలకొంది.