కొత్తగా చెక్ డ్యాం ల నిర్మణానికి ప్రభుత్వం నిర్ణయం

నేలపై పడే ప్రతి నీటిచుక్కను ఒడిసి పట్టుకొని భూగర్భ జల మట్టాన్ని  పెంచడం లక్ష్యంగా  ప్రభుత్వం మరో భగీరథ యజ్ఞానికి శ్రీకారం చుట్టింది.  రాష్ట్రంలోని వంతెనలను ప్రయాణం కోసమే కాకుండా.. నీటిని నిల్వ చేసే ప్రాజెక్టులుగా మార్చునున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నీ వంతెనల వద్ద.. చెక్‌ డ్యాంలను నిర్మించి నీటిని  నిల్వ  చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం  రూ.520  కోట్ల నిధులతో  174 చెక్‌ డ్యాంలను నిర్మించాలని ప్రణాళిక ఏర్పాటు చేసింది.

మెరుగైన ప్రజా రవాణాలో భాగంగా కొత్త వంతెనల నిర్మాణంను చేపట్టిన ప్రభుత్వం ఇందుకు సమాంతరంగా  చెక్‌డ్యాంల నిర్మాణానికి సైతం పూనుకొంటున్నది. వంతెనలకు సమాంతరంగా  చెక్‌డ్యాంల నిర్మాణం వల్ల భూగర్భజలాలు పెరగడంతో పాటు పచ్చదనం వృద్ధి చెందుతుందని ప్రభుత్వ అంచనా  వేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని మొత్తం 532 వంతెనలు ఉండగా.. సాంకేతికంగా  వెసులుబాటు ఉన్న ప్రాంతాల్లో చెక్‌డ్యాంల నిర్మాణానికి సిద్ధమైంది. ఏ వంతెనల వద్ద చెక్‌ డ్యాంలను నిర్మించవద్దనేది అధికారుల బృందం ఇప్పటికే పరిశీలించింది. మహారాష్ట్రలో అధ్యయనం చేసిన అధికారుల బృందం మొత్తం 174 ప్రాంతాలలో చెక్‌ డ్యాంల నిర్మాణానికి అనుకూలంగా ఉందని రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావుకి నివేదిక ఇచ్చింది.ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇప్పటికే.. వంతెనల వద్ద చెక్‌ డ్యాంల నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టారు.