కృష్ణాబేసిన్ లో జలకళ

కృష్ణాబేసిన్‌లో జలకళ ఉట్టిపడుతున్నది. నిన్నమొన్నటివరకూ నాగార్జునసాగర్‌కు కృష్ణమ్మ పరుగులపై ఉన్న అనుమానాలు తొలిగిపోయాయి. నిన్న ఒక్క రోజే నాగార్జునసాగర్‌కు 74 వేలా 348 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. కృష్ణాబేసిన్‌లో ఆల్మట్టి మొదలు దిగువన పులిచింతలవరకు పరిమాణంలో తేడా ఉన్నా, వరద మాత్రం అన్ని జలాశయాల్లోకి కొనసాగుతున్నది. శ్రీశైలానికి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. మంగళవారం ఉదయం ఆరుగంటలకు నారాయణపూర్ నుంచి 25వేల పైచిలుకు, జూరాల నుంచి 46వేల పైచిలుకు క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉండగా.. సాయంత్రం ఆరుగంటల సమయానికి నారాయణపూర్ నుంచి 35వేలు, జూరాల నుంచి రాత్రి ఎనిమిదిగంటల సమయానికి 1,70,900క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.

హంద్రీనీవా నుంచి కూడా శ్రీశైలానికి 25వేల క్యూసెక్కుల వరద తోడయింది. ఉదయం సుమారు 1.13లక్షల పైచిలుకు క్యూసెక్కులుంటే రాత్రి 8గంటల సమయానికి అది 1,73,211క్యూసెక్కులకు పెరిగింది. దీంతో అవుట్‌ఫ్లో కూడా ఉదయం 72వేల క్యూసెక్కుల వరకు ఉంటే.. రాత్రికి 81,948క్యూసెక్కులకు పెరిగింది. మంగళవారం రాత్రి 8గంటల వరకు శ్రీశైలం ఎడమ, కుడిగట్టు విద్యుత్‌కేంద్రాల ద్వారా కరెంటు ఉత్పత్తితో 42,378క్యూసెక్కులు, 31,970క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. రాత్రి ఎనిమిదిగంటల ప్రాంతంలో శ్రీశైలంలో 883.30 అడుగులకు నీటిమట్టం చేరుకున్నది…

శ్రీశైలం నుంచి అవుట్‌ఫ్లో పెరుగుతుండటంతో నాగార్జునసాగర్‌లోకి వరద పెరిగింది. మంగళవారం ఉదయం ఆరుగంటల వరకు సాగర్‌లో 523.80అడుగుల నీటిమట్టం ఉండగా.. సాయంత్రం ఆరుగంటల సమయానికి అది 524కు చేరుకున్నది. నీటినిల్వ 156.29టీఎంసీలుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 590 అడుగులతో 215.81 టీఎంసీలు కావడంతో ఇంకా 155.38 టీఎంసీల నీటినిల్వకు అవకాశముంది.