కిన్నెరసాని ఎడమకాల్వ ప్రారంభానికి సర్వం సిద్ధం

దాదాపు పదకొండేళ్ళుగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసుకొని కిన్నెరసాని ప్రాజెక్టు ఎడమ కాలువ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఎడమ కాలువ నుంచి మంత్రులు హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వరరావు నీటిని విడుదల చేయనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిన్నెరసాని ప్రాజెక్టు కాలువల నిర్మాణం  పనులు ఏళ్ళ తరబడి పూర్తి కాకుండా ఉన్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 8.4 టి.ఎం.సి.లు. 2006 లో ప్రాజెక్టు కాలువల నిర్మాణం చేపట్టినప్పటికీ పనులు పూర్తి చేయలేదు.  పనులన్నీ లోపభూయిష్టంగా జరిగాయి. 2012 లో ఈ ప్రాజెక్టు కుడి కాలువ నుంచి కేవలం 2 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరందించారు. ప్రాజెక్టు పూర్తి ఆయకట్టు 10,000 ఎకరాలకు సాగునీరందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో రంగంలోకి దిగిన మంత్రి హరీశ్ రావు.. ఇంజనీరింగ్ అధికారులు, ఏజన్సీ ప్రతినిధులను ఉరుకులు, పరుగులు పెట్టించారు.భూ సేకరణ వంటి సమస్యలను పరిష్కరించారు. ఇటు మంత్రి హరీశ్ రావు, అటు జిల్లా మంత్రి తుమ్మల నిరంతరం సమీక్షలతోనే పనులు ఇంత వేగంగా జరిగాయి.

కొత్తగూడెం,పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల రైతాంగానికి కిన్నెరసాని లెఫ్ట్ కెనాల్ నుంచి సాగునీరందించేందుకు పనులు పూర్తయ్యాయి. లెఫ్ట్ కెనాల్ 20.06 కిలోమీటర్ల పొడవునా నిర్మాణం పనులు పూర్తయినయ్‌. కొత్తగూడెం నియోజకవర్గంలో కుడి కాల్వ నుంచి 3 వేల ఎకరాలకు నీరందనుంది. లెఫ్ట్ కెనాల్ నుంచి కొత్తగూడెం లో 2100, పినపాక లో 4,900 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రతివారం మంత్రి హరీశ్ రావు కిన్నెరసాని లెఫ్ట్ కెనాల్ పనుల పురోగతిని సమీక్షిస్తూ వచ్చారు. నత్తనడకన పనులు సాగించే ఏజన్సీ పై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి కాకపోతే సంబంధిత ఇరిగేషన్ అధికారులపై కూడా చర్యలు ఉంటాయని మంత్రి పదే, పదే హెచ్చరించడంతో పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యాయి.

ఇకపాలెంవాగును పూర్తి చేసి.. మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని గత అక్టోబరులో శాసనమండలి వేదికగా ఇచ్చిన హామీని మంత్రి హరీశ్‌రావు నిలబెట్టుకొన్నారు. ఇప్పటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో పదివేల ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు పాలెంవాగు చేపట్టారు. ప్రాజెక్టు ప్రారంభ సమయంలో అంచనావ్యయం 70.99 కోట్లు కాగా.. పనుల్లో భాగంగా నిర్మించిన బండ్‌కు 2006, 2008లలో రెండుసార్లు గండిపడింది. 50వేల క్యూసెక్కుల సామర్థ్యంతో డిజైన్ చేయగా..86వేల క్యూసెక్కుల ప్రవాహం పాలెంవాగుకు రావడంతో దాని డిజైన్‌పై పునఃపరిశీలన జరుపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో మిగిలిన 36వేల క్యూసెక్కుల వరద వెళ్లేందుకుగాను 2010లో 80 కోట్ల వ్యయంతో నాలుగు ద్వారాలు ఉండేలా నాన్‌గేటెడ్ స్పిల్ నిర్మించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టిసారించి.. 2017లో రూ.221 కోట్లతో సవరణ అంచనావ్యయం రూపొందించి భూసేకరణ సమస్యలకు పరిష్కారం చూపారు.

మరోవైపు ఖమ్మం జిల్లా పాలేరు పాత కాలువ ఆధునీకరణ మరో చరిత్రను సృష్టించింది. కొత్త రికార్డులను నెలకొల్పింది. 20 నెలలలో జరగాల్సిన పనులు నాలుగు నెలలకే పూర్తి చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కింది. గత జూలై 15 నాటికి ఈ పనులు పూర్తయ్యాయి. అదే నెలలోనే ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కాలువ నుంచి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, మంత్రి తుమ్మల ఇవాళ నీటిని విడుదల చేయనున్నారు. దీంతో 25 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. పాలేరు పాత కాలువ ఆధునీకరణ పనుల్లో భాగంగా పూడిక తీశారు. కాలువలోని ఇతర శిథిలాలను, ఇరువైపులా ఉన్న రాయిని తీసేశారు. బ్లాస్టింగ్ ద్వారా బండరాళ్లనీ  తొలగించారు. కాలువ దారిలో పూర్తిగా శిథిలమైన 9 వంతెనలను పూర్తిగా తొలగించి డబుల్ లైన్ రోడ్ బ్రిడ్జి లను నిర్మించారు. కాలువపై ఉన్న 32 తూములను పూర్తిగా తొలగించి సిమెంట్ కాంక్రీటుతో కొత్త తూములను నిర్మించి వాటికి కొత్త గేట్లు అమర్చారు. శిథిలావస్థలో ఉన్న ఏడు అండర్  టన్నెల్ లను తొలగించి ఆ స్థానంలో కొత్త వాటిని నిర్మించారు. కాలువ నీటి నిర్వహణ, పంపిణీ క్రమబద్ధీకరణ కోసం రెండు క్రాస్  రెగ్యులేటర్లను నిర్మించారు. కాలువపై ఉన్న  22 ఇన్ లెట్, ఔట్ లెట్ లను పూర్తిగా తొలగించారు. కాంక్రీటుతో వాటిని కొత్తగా నిర్మించారు. 3.9 కిలోమీటర్ల కాలువకు ఇరువైపులా కాంక్రీటుతో గోడలు నిర్మించారు. ఈ పనులు రికార్డు స్థాయి వ్యవధిలో పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ సిబ్బంది, వర్క్ ఏజెన్సీ సిబ్బంది, కార్మికులు మూడుషిఫ్టులు, రేయింబవళ్లు పని చేశారు.

పాలేరు పాత కాలువను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరింది. దీంతో  చివరి ఆయకట్టు వరకు నీళ్లు విడుదలయ్యే పరిస్థితి లేదు. పాలేరు పాత కాలువ సామర్థ్యం 250 క్యూసెక్కులైతే, శిథిలావస్థకు చేరడం వల్ల కేవలం 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే గండి పడే పరిస్థితి ఉండేది. పాలేరు పాత కాలువ నిర్మించి 95 సంవత్సరాలు కావడంతో కాలువ అడుగు భాగంలో 3 అడుగులకుపైగా పూడిక ఏర్పడింది. 360 రోజులు ఆన్ అండ్ ఆఫ్ పద్దతిలో నీరు ప్రవహిస్తున్నందున అడుగు భాగాన గుర్రపు డెక్క పెరిగి కాలువ ప్రవాహానికి అడ్డంకిగా మారింది. సీఎం కేసీఆర్  కేబినెట్‌  లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కూసుమంచి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఆయకట్టు రైతులు పాలేరు పాత కాలువ గురించి మంత్రికి గోడు వెళ్లబోసుకున్నారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే పాలేరు పాత కాలువ పునరుద్ధరణ కోసం 64 కోట్లు మంజూరు చేశారు. 2017 ఫిబ్రవరి 16న పాలేరు ఆధునీకరణ పనులకు మంత్రులు హరీశ్  రావు, తుమ్మల శంకుస్థాపన చేశారు. ఆరు నెలల్లోనే కాలువ లైనింగ్ పనులు పూర్తి చేస్తానని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం హామీనిచ్చింది. ఈ మేరకు రైతులు ప్రభుత్వంపై  నమ్మకంతో ఒక పంటను వదిలేసుకున్నారు. నాలుగు నెలల్లోనే పనులు పూర్తి చేసిన అధికారులకు, కార్మికులకు, కాంట్రాక్టర్‌  కి మంత్రులు హరీశ్ రావు, తుమ్మల ప్రత్యేక అభినందనలు తెలిపారు.