ఎన్జీటీ స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్తాం

జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కాళేశ్వరం ప్రాజెక్టుపై స్టే ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పైశాచిక ఆనందం, రాక్షసానందం పొందుతున్నారని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాళేశ్వరం విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్ళి న్యాయం సాధిస్తామని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రాణహిత ప్రాజెక్టుకు కొనసాగింపుగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని మంత్రి హరీశ్ రావు వివరించారు. గతంలో ప్రాజెక్టులను అడ్డుకునే ఉద్దేశం లేనందున తాము కోర్టుకు వెళ్లలేదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కుళ్లు రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు అవసరం లేదని విమర్శించారు. ఇంటింటికి మంచినీళ్లు అందించేందుకు మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టామని, ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత కీలకం అని మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఎన్జీటీ స్టే తాత్కాలిక అడ్డంకి మాత్రమేనని అన్నారు. అత్యంత వేగంగా దీన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

పదేళ్ళ పాటు కాంగ్రెస్ హయాంలో ప్రాణహితకు అనుమతులు సంపాదించలేదని, తాము మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని వేగంగా ప్రాజెక్టు పూర్తి చేస్తున్న దశలో కోర్టుల ద్వారా అడ్డంకులు కల్పిస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.