కలెక్టర్ గా నయనతార

గ్లామర్‌ పాత్రలు, పర్‌ఫార్మెన్స్‌ క్యారెక్టర్లలో నటించే నయనతార పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో నటిస్తున్న కొత్త చిత్రం కర్తవ్యం. గోపి నైనర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆర్‌. రవీంద్రన్‌ నిర్మాత. ఆయన ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ సంస్థపై శివలింగ, విక్రమ్‌ వేదా వంటి చిత్రాలను నిర్మించి, పలు చిత్రాలను పంపిణీ చేశారు. తమిళంలో ఆరమ్‌ పేరుతో వచ్చిన చిత్రాన్ని తెలుగులో కర్తవ్యం పేరుతో విడుదల చేస్తున్నారు. ఇందులో నయనతార జిల్లా కలెక్టర్‌ పాత్రలో కనిపిస్తారు.

దక్షిణాదిలో నయనతార క్రేజీ ఆర్టిస్టు. ఆమె వరుసగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు సోలో నాయికగా కూడా పలు చిత్రాలు చేస్తున్నారు. తాజాగా నటించిన కర్తవ్యంలో జిల్లా కలెక్టర్‌గా ఆమె అభినయం ఆకట్టుకుంటుందని నిర్మాత చెప్పారు. ప్రజల కోసం పాటుపడుతూ, రాజకీయ నాయకులకు ఎలా చెక్‌ పెట్టారనే కథాశంతో ఈ చిత్రం ఉంటుందన్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు. ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఓం ప్రకాష్‌ కెమెరామెన్‌గా వ్యవహరించారు.