కన్నుల పండువగా చక్రస్నానం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు చక్రస్నాన కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామివారి చివరి రూపమైన అర్చా విగ్రహానికి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. భారీ వర్షంలోనూ అధిక సంఖ్యలో భక్తజనం పాల్గొని స్వామివారి చక్రస్నాన కార్యక్రమాన్ని వీక్షించారు.

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి, ఉభయదేవేరులు, చక్రత్వాళ్వారుకి స్నపన తిరుమంజనం జరిగింది. తర్వాత స్వామి వారి ప్రతినిధిగా చక్రత్వాళ్వారుకి వరాహ పుష్కరిణిలో స్నానమాచరింపజేశారు. చక్రస్నానం తర్వాత తిరుమలేశుడు ఆనంద నిలయానికి చేరుకున్నారు. వెంకటేశ్వరుని అవతార నక్షత్రమైన శ్రవణ పర్వదినాన చక్రస్నాన కార్యక్రమం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. చక్రస్నానం ద్వారా భక్తులకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని విశ్వాసం.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం పల్లకీ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాత్రికి ద్వజావరోహణంలో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.  బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు.