ఏపీ జలచౌర్యానికి  కృష్ణ బోర్డు తొండిలెక్కలు

రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేయాల్సిన కృష్ణాబోర్డు ఏపీకి వంతపాడుతోంది. ఏపీ చేసిన జలచౌర్యాన్ని కప్పిపుచ్చేందుకు తెలంగాణను దోషిగా నిలబెడుతుంది. కృష్ణా నీటిని న్యాయంగా వాడుకుంటున్న తెలంగాణను ఏపీ గాటిన కట్టేసి రెండు రాష్ట్రాలు బోర్డు అనుమతి లేకుండా నీటిని వాడుకుంటున్నాయంటూ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.

నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లో కనిష్ఠ నీటి సేకరణ స్థాయి నిర్వహించడమనేది కృష్ణాబోర్డు కనీస బాధ్యత. కృష్ణాబోర్డు అధికారులు దానిని విస్మరించినా తెలంగాణ ఆ బాధ్యతను నెరవేర్చడంలో భాగంగా శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా సాగర్‌కు నీటిని వదిలింది. సాగర్‌లో నిల్వ చేసిందేగానీ ఎక్కడా వినియోగించుకోలేదు. అదే సమయంలో ఏపీ ఎలాంటి అనుమతులు లేకుండా శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రోజూ 12వేల క్యూసెక్కుల నీటిని నిర్విరామంగా తరలించుకుపోతున్నది. నిబంధనల ప్రకారం ఏపీ చర్యను జలచౌర్యంగా పరిగణించాలి. కానీ రెండు రాష్ట్రాలు అనుమతిలేకుండా నీటిని వాడుకుంటున్నాయంటూ బోర్డు సభ్యుడు సీ వెంకట సుబ్బయ్య పేరిట కేంద్రానికి లేఖ వెళ్లింది.

పోతిరెడ్డిపాడు ద్వారా ఐదు టీఎంసీలకు మాత్రమే అనుమతించగా ఏపీ 14.409 టీఎంసీలు తరలించుకుపోయిందని లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు రెండు రాష్ర్టాలు చెరి 8 టీఎంసీల చొప్పున మొత్తం 16 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉండగా.. ఏపీ 4.201 టీఎంసీలే వదిలిందనీ, తెలంగాణ 28.414 టీఎంసీలు విడుదల చేసిందని తెలిపారు. ఇలా రెండు రాష్ర్టాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని కేంద్రం జోక్యం చేసుకొని వెంటనే నీటి విడుదలను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఏపీ ఇప్పటికి దాదాపు 15 టీఎంసీలకు పైగా కృష్ణాజలాల్ని మళ్లించుకున్నది. సాధారణంగా సాగర్‌లో 510 అడుగుల ఎండీడీఎల్‌ను నిర్వహించాలి. కానీ అక్కడ ఎండీడీఎల్ 500 అడుగుల వరకు వెళ్లడంతో శ్రీశైలంకు వరద వస్తున్నందున దిగువకు నీళ్లొదలాలని బోర్డును తెలంగాణ కోరింది. కానీ అటు బోర్డు, ఇటు ఏపీ పట్టించుకోకపోవడంతో శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా దిగువకు నీటిని వదిలింది.

ఎండీడీఎల్ నిర్వహణకు 15 టీఎంసీలకు పైగా నీటి అవసరముంది. మరోవైపు త్రిసభ్య కమిటీ భేటీలో నిర్ణయించిన మేరకు ఆంధ్రప్రదేశ్‌కు కుడి కాల్వ ద్వారా ఆరు టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి రెండు టీఎంసీలు ఇవ్వాల్సి ఉంది. ఇలా మొత్తం 23 టీఎంసీల అవసరం ఉన్న దరిమిలా తెలంగాణ ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా నీటిని దిగువకు వదిలింది. ఇది సాగర్‌లో నీటి నిల్వను పెంచడమే తప్ప వినియోగించుకోవడం కాదు. పైగా బోర్డు ఆదేశాల ప్రకారం కుడి గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా ఆంధ్రప్రదేశ్ 8 టీఎంసీలు దిగువకు వదులాలి. కానీ 4.201 టీఎంసీలు మాత్రమే వదిలింది. ఇలా రెండో విధంగా కూడా ఉల్లంఘనకు పాల్పడింది ఏపీ మాత్రమే తప్ప తెలంగాణ కాదు. వాస్తవాలు ఇలా ఉంటే బోర్డు అధికారులు మాత్రం ఏపీ జతన తెలంగాణను చేర్చడం..  ఏపీ జల చౌర్యాన్ని మరుగున పడేయడమేనని  నీటి పారుదల ఆధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.