ఎయిర్‌టెల్‌లో టాటా టెలీ విలీనం

భారతీ ఎయిర్‌టెల్‌లో టాటా టెలీ సర్వీసెస్ విలీనమైపోతున్నది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి, నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న టాటా గ్రూప్, మొబైల్ టెలిఫోన్ వ్యాపారం నుంచి ఎలాగైనా బయటపడాలనుకున్నది. దాన్ని ఎట్టకేలకు వదిలించుకుంది. రుణ భారం ఏమాత్రం తగ్గకపోయినా, చేతికి కొత్తగా నిధులేమీ రాకపోయినా.. కేవలం తమ స్పెక్ట్రమ్ నిల్వలకు ఊతమిచ్చేలా రుణ-నగదు రహిత ఒప్పందాన్ని టాటా గ్రూప్ కుదుర్చుకుంది. డెట్-ఫ్రీ, క్యాష్-ఫ్రీ ప్రాతిపదికపై దేశవ్యాప్తంగా 19 టెలికం సర్కిళ్లు లేదా జోన్లలోగల టీటీఎస్‌ఎల్, టీటీఎమ్‌ఎల్‌లకు చెందిన 4 కోట్లకుపైగా కస్టమర్లు నవంబర్ 1 నుంచి ఎయిర్‌టెల్ కస్టమర్లలో కలిసిపోనున్నారు.

ఈ డీల్ అనంతరం కూడా టాటా టెలీ సర్వీసెస్‌కున్న రూ. 31,000 కోట్ల రుణ భారం బాధ్యత టాటా గ్రూప్‌దే. అయితే ప్రభుత్వానికి వాయిదాలపై చెల్లించాల్సిన రూ. 9,000-10,000 కోట్ల స్పెక్ట్రం బకాయిల్లో ఎయిర్‌టెల్ దాదాపు 20 శాతం ఇవ్వనుంది. అంటే రూ. 1,800 కోట్ల నుంచి రూ. 2,000 కోట్లు మాత్రమే. మిగతా మొత్తాన్ని కూడా టాటా గ్రూపే చెల్లించనుంది.

ఇక ఈ ఒప్పందాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో టాటా గ్రూప్, దాని వాటాదారుల కోసం చేసుకున్న అత్యుత్తమ, అత్యంత సుహృద్భావ పరిష్కారంగా అభివర్ణించారు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్. భారతీయ మొబైల్ పరిశ్రమలో తదుపరి ఏకీకరణ, స్థిరీకరణకు ఇది గొప్ప నిర్ణయమని, దీనివల్ల పెరిగే టెక్నాలజీ, పోర్ట్ ఫోలియోతో చౌక, ప్రపంచ శ్రేణి సేవలను అందిస్తామన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్. కాగా, మున్ముందు టాటా, భారతీ ఎయిర్‌టెల్ పరస్పర సహకారంతో ముందుకెళ్ళగలవన్న ఆశాభావాన్ని ఇరు సంస్థలు వ్యక్తం చేశాయి.

గత ఏడాది సెప్టెంబర్ నుంచి టెలికం రంగం ఏకీకరణ వైపు అడుగులేస్తోంది. జియో రాక నేపథ్యంలో ఇప్పటికే వొడాఫోన్-ఐడియా సెల్యులార్ ఒక్కటైపోతుండగా, దీనివల్ల దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా ఆవిర్భవించనుంది. దీని విలువ దాదాపు రూ. 1,51,153 కోట్లకు పైమాటే. కస్టమర్ల సంఖ్య 40 కోట్లకు చేరుతుంది. దీంతో ఎయిర్‌టెల్ స్థానం రెండుకు పడిపోనుంది. అయితే టాటా టెలీ డీల్‌తో ఎయిర్‌టెల్ కస్టమర్ల సంఖ్య 32 కోట్లకుపైకి చేరుకోనున్నది. జియో వినియోగదారులు కేవలం ఏడాదిలో 12.8 కోట్లకు చేరిన నేపథ్యంలో మార్కెట్ లీడర్‌షిప్‌ను ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదనుకుంటున్న ఎయిర్‌టెల్.. వీలైనన్ని సంస్థలను తమలో ఐక్యం చేసుకుని కస్టమర్లను పెంచుకోవాలని చూస్తున్నది. గడిచిన ఐదేండ్లలో టాటా టెలీ సహా మొత్తం ఏడు డీల్స్‌ ను ఎయిర్‌టెల్ ఇప్పటిదాకా చేసుకోవడం గమనార్హం. ఈ ఫిబ్రవరిలో ఆంధ్రపద్రేశ్ తదితర ఏడు సర్కిళ్లలోగల టెలీనార్ కార్యకలాపాలను ఎయిర్‌టెల్ తమ గుప్పిట్లోకి తీసుకుంది.