ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా అనుపమ్ ఖేర్

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీఐఐ) చైర్మన్‌గా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఈ ఇన్‌స్టిట్యూట్ మహారాష్ట్రలోని పుణెలో ఉంది. పుణె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ గా ఇది ప్రసిద్ధి.  ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న టెలివిజన్ నటుడు గజేంద్ర చౌహాన్ స్థానంలో అనుపమ్ ఖేర్ చైర్మన్ అయ్యారు.

500కు పైగా హిందీ సినిమాల్లో అనుపమ్ ఖేర్ నటించారు. గతంలో ఆయన సీబీఎఫ్‌సీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్మన్లుగానూ వ్యవహరించారు. సినిమా, ఆర్ట్స్‌కు ఆయన అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం 2004లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్‌తో  సత్కరించింది. ఆయన భార్య కిరణ్ ఖేర్ కూడా నటే. ఎఫ్టీఐఐలోనే ఖేర్ చదివారు. చదివిన సంస్థకే చైర్మన్ కావడం పట్ల ఖేర్ ఆనందం వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన మనసుతో సంస్థలోకి వెళ్తానని, తాను చేయగలిగినంత చేస్తానని చెప్పారు.

ఇప్పటివరకు ఎఫ్టీఐఐ చైర్మన్‌గా ఉన్న గజేంద్ర చౌహాన్‌కు వ్యతిరేకంగా గతేడాది ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు 139 రోజుల పాటు ఆందోళనలు నిర్వహించారు. ఆయన నియామకం రాజకీయ ప్రేరేపితం అంటూ విద్యార్థులు గజేంద్ర చౌహాన్‌ను వ్యతిరేకించారు. ఈ ఏడాది మార్చిలో ఆయన పదవి నుంచి దిగిపోయారు. సంఘ్ పరివార్, బీజేపీ ప్రభుత్వం అసహనంపై కొన్ని నెలల కిందట దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన సమయంలో ఖేర్ ఆ పార్టీ తరఫున గట్టిగా వాదించారు. బీజేపీకి గట్టి మద్దతుదారు అయిన అనుపమ్ ఖేర్ ను ఆ పదవికి ఎంపిక చేశారు.