ఎక్స్ ప్రెస్ నేషనల్ హైవేస్ పై మంత్రి తుమ్మల సమీక్ష

హైదరాబాద్-అమరావతి, హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-బెంగళూరు ఎక్స్ ప్రెస్ నేషనల్ హైవేస్ తెలంగాణకు తలమానికం అవుతాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) అధికారులతో  హైదరాబాద్ లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్రం సహకారం అందించే ఈ మూడు నేషనల్ హైవేస్ తాజా స్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ మూడు ఎక్స్ ప్రెస్ నేషనల్ హైవేస్ కు కేంద్రం నుంచి త్వరగా అనుమతులు సాధించేందుకు సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని మంత్రి తుమ్మల చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టం-2014 పరిధిలో ఈ మూడు ఎక్స్ ప్రెస్ నేషనల్ హైవేస్ రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. కాగా, హైదరాబాద్-అమరావతి ఎక్స్ ప్రెస్ నేషనల్ హైవే డీపీఆర్ తయారీకి కన్సల్టెంట్లను నియమించేందుకు టెండర్లు పిలిచామని, త్వరలో పని మొదలవుతుందని వెల్లడించారు. హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-బెంగళూరు ఎక్స్ ప్రెస్ నేషనల్ హైవేల అనుమతికి ప్రతిపాదనలు పెట్టామని, అవి కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయని మంత్రి తెలిపారు.

రాష్ట్రం కొత్తగా ఆమోదించిన భూసేకరణ చట్టం-2017లోని సెక్షన్ 21 ప్రకారం భూసేకరణ జరిపేందుకు ఎన్.హెచ్.ఎ.ఐ కి కేంద్రం నుంచి అనుమతి ఇచ్చే విషయంలో తాను, రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర ప్రతినిధులు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో సంప్రదింపులు జరిపామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ చట్టం ప్రకారం భూ సేకరణ జరపాల్సిందిగా ఎన్.హెచ్.ఎ.ఐ అధికారులకు సూచించారు.