ఈ నెల 19 వరకు వర్షాలు

ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం, మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇవాళ దక్షిణ కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రేపటి నుంచి కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.

ఈ నెల 15 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ పరిసరాల్లో 4.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నది. మరో వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ నుంచి నిష్క్రమిస్తాయని, ఆ తర్వాత వచ్చే ఈశాన్య రుతుపవనాల వల్ల కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.