ఇవాళ సూర్యాపేటకు సీఎం కేసీఆర్

జిల్లాల పర్యటనలో భాగంగా ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. సూర్యాపేట పట్టణంలో కొత్తగా నిర్మించనున్న కలెక్టరేట్‌, ఎస్పీ భవనాల నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేస్తారు. అటు గొల్లబజార్‌లో నిర్మాణం పూర్తైన.. 200 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను మంత్రి జగదీష్‌ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు అందచేయనున్నారు. ప్రారంభోత్సవాలు.. భూమి పూజలు ముగిసిన తర్వాత.. సూర్యాపేట పట్టణంలోని జూనియర్‌ కాలేజ్‌ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి.. ఆయన ప్రసంగిస్తారు.

చివ్వెంల మండల కేంద్రంలో నిర్మించిన మోడల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలిస్తారు. అక్కడ ప్రజలకు వైద్యం ఏ విధంగా అందుతుందనే విషయాన్ని తెలుసుకుంటారు. మరో వైపు వట్టి కాంపాడ్‌ గ్రామంలో కొత్తగా నిర్మించిన 400 కె.వి సబ్‌ స్టేషన్‌ ఆయన ప్రారంభింస్తారు. చందుపట్ల గ్రామంలో మిషన్ భగీరథ వాటర్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్‌తో పాటు మోడల్‌ అంగన్‌ వాడీ కేంద్రాన్ని ఆయన సందర్శిస్తారు.

సీఎం కేసీఆర్‌ రాక ను పురస్కరించుకొని.. అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు  చేశారు. డీఐజీ శివశంకర్‌ నేతృత్వంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. బహిరంగ సభకు దాదాపు 40 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు.  సీఎం కేసీఆర్‌ పర్యటనతో సూర్యాపేట పట్ణణంలో ఎక్కడ చూసినా.. స్వాగత తోరణాలు, భారీ కటౌట్‌లు కనిపిస్తున్నాయి. మంత్రి జగదీష్‌ రెడ్డి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.  సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం సూర్యాపేట జిల్లాను ఏర్పాటు చేశారని.. యేడాది తర్వాత వార్షికోత్సవానికి హజరవుతున్నారని.. అధికారిక భవనాలకు ఆయన శంకుస్థాపన చేస్తారని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు