ఇవాళ సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన                  

సీఎం కేసీఆర్ పాలనలో జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా కొత్త జిల్లాల్లో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు జరుగుతున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆయా జిల్లాల్లో కలెక్టరేట్, ఇతర ముఖ్య భవనాలకు శంకుస్థాపనలు జరగనున్నాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్ స్వయంగా రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.  సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.

సిద్ధిపేట జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం కేసీఆర్. ముందుగా గజ్వేల్ నియోజకవర్గం దుద్దెడ శివారులో కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ కార్యాలయాల భవన సముదాయాలకు శంకుస్థాపన చేస్తారు.  ఆ తరువాత సిద్ధిపేటలోని ఎన్సాన్ పల్లి శివారులో నిర్మించనున్న మెడికల్ కళాశాలకు భూమి పూజ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు

మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. జిల్లాగా ఏర్పాటైన తర్వాత తొలిసారిగాసిరిసిల్లలో పర్యటిస్తున్నారు.  దాదాపు 850 కోట్ల విలువైన కొత్త పథకాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 93 ఎకరాల్లో అధునాతన హంగులతో నిర్మించనున్న కలెక్టరేట్ భవన సముదాయానికి, 30 కోట్లతో చేపడుతున్న రెండో రింగ్‌రోడ్డు పనులకు, 80 ఎకరాల్లో అపెరల్ పార్క్‌కు, 553 కోట్లతో నిర్మిస్తున్న మల్కపేట జలాశయానికి  శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకాలతో సిరిసిల్లకు మహర్దశ పట్టనున్నది.

సిరిసిల్ల మండలం సర్ధాపూర్ వద్ద 80 ఎకరాల స్థలంలో అపెరల్‌పార్కుకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారు. 30 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు రాజన్న-సిరిసిల్ల జిల్లాలోని ఆరు వేల మంది మహిళలకు ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తుంది. ఇందుకు అవసరమయ్యే వస్ర్తాన్ని సిరిసిల్లలోనే తయారుచేస్తారు. వేలమంది నేత కార్మికులకు లబ్ధి చేకూరనున్నది.

మెట్ట ప్రాంతమైన రాజన్న-సిరిసిల్ల జిల్లాలో ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ ద్వారా 86 వేల 150 ఎకరాలకు సాగునీరు అందేవిధంగా రూపకల్పన చేశారు. ఇందులో అత్యంత కీలకమైన మల్కపేట జలాశయం పనులకు ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేయనున్నారు. మూడు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే జలాశయానికి ప్రభుత్వం 553 కోట్లు మంజూరుచేసింది. ఈ జలాశయం ఎడమ కాల్వ కింద 4 వేల 284 ఎకరాలు, కుడికాల్వ కింద 34 వేల 791 ఎకరాలు సాగవుతాయి. మరోవైపు దేశంలోనే ప్రప్రథమంగా 203 కోట్లతో చేపడుతున్న వర్క్ టు ఓనర్ అనే కొత్త పథకానికి కూడా సీఎం అంకురార్పణ చేయనున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అటు సిద్దిపేట జిల్లాలోనూ ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక సీఎం కేసీఆర్ కు కనివినీ ఎరుగని రీతిలో ఘనస్వాగతం పలికేందుకు రెండు జిల్లాల్లోనూ టీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనతో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు మహర్దశ పట్టనుంది.