ఇవాళ రాంచీ లో భారత్ –ఆసిస్ టీ20 మ్యాచ్

వన్డే సిరీస్ లో పూర్తిగా డామినేట్ చేసిన టీమిండియా.. ఆసీస్ తో జరిగే మూడు టీ20 సిరీస్ కు రెడీ అవుతోంది. ఇవాళ 7 గంటలకు రాంచీ వేదికగా తొలి టీ20 జరగనుంది. వన్డే సిరీస్‌లో ఎదురులేని ప్రదర్శన చేసిన కోహ్లీసేన.. పోట్టి ఫార్మాట్ లోనూ సత్తా చాటాలను చూస్తోంది. జట్టు కూర్పుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అటు టీ20 సిరీస్ లో  అయినా సత్తా చాటాలని ఆసీస్ యోచిస్తోంది. పలు మార్పులతో బరిలోకి దిగుతోంది.

వన్డే సిరీస్ లో ఒక్కరిద్దరు మినహా ఆసీస్ ఆటగాళ్లంతా తేలిపోయారు. ఓపెనర్లు ఫించ్, వార్నర్ లు పర్వాలేదనిపించారు వీరిద్దరు తొలి మ్యాచ్ లో రాణిస్తే టీమిండియాకు కష్టాలు తప్పకపోవచ్చు, ఇక గాయంతో పేసర్ కమ్మిన్స్ దూరం కావడంతో ఆసీస్ పేస్ విభాగం మరింత బలహీనంగా మారింది. టీ20 స్పెషలిస్ట్ మ్యాక్స్ వెల్ పైనే ఆసీస్ భారీ ఆశలు పెట్టుకుంది.  కెప్టెన్ స్మిత్ తో పాటు మిడిలార్డర్ బ్యాట్స్ మెన్లు రాణిస్తేనే టీమిండియాకు ఆసీస్ కాసింత పోటీనిచ్చే అవకాశం ఉంది.

మరోవైపు భీకర ఫామ్‌ తో టీమిండియా బరిలోకి దిగుతోంది. రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లు సైతం రాణిస్తుండటంతో జట్టు కూర్పు సమస్యగా మారింది. కేఎల్‌ రాహుల్‌ కు మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ గా  తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. మళ్లీ జట్టులోకి వచ్చిన ధావన్ తో రోహిత్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. మిడిలార్డర్ లో  కోహ్లి, జాదవ్‌, ధోనీ, పాండ్యలతో కూడిన భారత బ్యాటింగ్ ఆర్డర్ దుర్భేద్యంగా ఉంది. ఇక బౌలింగ్ లోనూ భారత్ ఎదురులేదు. స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ లో మరోసారి ఆసీస్ బ్యాట్స్ మెన్లకు చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇటు వెటరన్  నెహ్రా రాకతో  పేస్ ఎటాక్ మరింత బలోపేతం అయింది.

ఇక ధోనీ ఇలాకా అయిన రాంచీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో వరుణుడు కరుణిస్తేనే మ్యాచ్ సాఫీగా సాగే అవకాశం ఉంది. భారీ వర్షానికి పిచ్‌ను కవర్లతో కప్పే ఉంచారు. ప్రాక్టీస్‌ కూడా రద్దయింది. మ్యాచ్‌ రోజు కూడా మధ్యాహ్నం తర్వాత వర్షం పడొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. మ్యాచ్‌ సమయంలోనూ వరుణుడు అడ్డుపడొచ్చు. రాంచీ పిచ్‌ బ్యాట్స్‌ మెన్‌, స్పిన్నర్లకు అనుకూలమని ఎక్స్ ఫర్ట్స్ అంచనా వేస్తున్నారు. టీ20ల్లో ఆసీస్ పై టీమిండియాకు ఘనమైన రికార్డుంది ఇప్పటి వరకు 13 మ్యాచ్ లు జరిగే 9 మ్యాచ్ ల్లోనూ టీమిండియానే నెగ్గింది. చివరి ఆరు మ్యాచ్ ల్లోనూ ఆసీస్ ను మట్టికరిపించింది