ఇవాళ ఆసీస్ తో రెండో టీ-20

భారతగడ్డపై కంగారులకు మరో సవాల్ ఎదురు కానుంది. గువహటి వేదికగా రెండో టీ20 జరగనుంది. తొలి టీ20లో ఘన విజయం సాధించిన టీమిండియా టి20 సిరీస్‌ ను ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. అద్భుత ఫామ్ లో ఉన్న టీమిండియా ఆసీస్ ను మరోసారి మట్టికరిపించేందుకు రెడీ అవుతోంది. అటు భారత గడ్డపై పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న ఆస్ట్రేలియా.. టీ20 సిరీస్ ఆశలు మిగలాలంటే ఈ మ్యాచ్ లో గెలిచితీరాలని చూస్తోంది.

వన్డే సిరీస్ లో పూర్తిగా డామినేట్ చేసిన టీమిండియా.. రాంచీ టీ20లోనూ రెచ్చిపోయింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్ లో 9 వికెట్ల భారీ తేడాతో నెగ్గి సిరీస్ లో ముందంజ వేసింది. ముఖ్యంగా యంగ్ స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ లు ఆసీస్ బ్యాట్స్ మెన్లకు చుక్కలు చూపిస్తునారు. పేసర్లు బూమ్రా, భువీలు సైతం అద్భుత ప్రదర్శనతో అలరిస్తున్నారు. దుర్భేధ్యమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను అడ్డుకోవడం ఆస్ట్రేలియాకు శక్తికి మించిన పనే.

ఇక భారత పర్యటనలో ఒక్కరిద్దరు మినహా ఆసీస్ ఆటగాళ్లంతా పూర్తిగా తేలిపోయారు. ఓపెనర్లు ఫించ్, వార్నర్ లు పర్వాలేదనిపిస్తున్నా..  మిగతా బ్యాట్స్ మెన్లు పూర్తిగా విఫలం అయ్యారు . రాంచి టీ20కి దూరమైన స్మిత్ మళ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పిన్ ఆడటంలో తడబడుతున్న మ్యాక్స్ వెల్..  చాహల్ ను ఎదురుకోలేకపోతున్నాడు.  అయితే బలమైన బౌలింగ్ తో బరిలోకి దిగుతున్న ఆసీస్.. ఈ మ్యాచ్ లోనైనా టీమిండియాను కట్టడి చేయాలని చూస్తోంది. దీంతో పాటు సిరీస్ ఆశలు ఉండాలంటే తప్పని సరిగా నెగ్గాల్సిన మ్యాచ్ కావడంతో కంగారులు.. తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

ఇక తొలి అంతర్జాతీయ మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న గువహటి స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది. టాస్ నెగ్గిన టీమ్ మరోసారి ఫస్ట్ బ్యాటింగ్ కే మొగ్గుచూపనుంది. ఇక టీ20ల్లో టీమిండియాకు ఆసీస్ పై గణమైన రికార్డుంది. ఇరుజట్ల మధ్య  ఇప్పటి వరకు 14 మ్యాచ్ లు జరిగితే టీమిండియా ఏకంగా పది మ్యాచ్ ల్లోనూ విజయం సాధించింది. కేవలం నాలుగు మ్యాచ్ ల్లోనే ఓడింది. చివరి ఏడు మ్యాచ్ ల్లోనూ ఆసీస్ పై నెగ్గి అజేయ రికార్డును కంటిన్యూ చేస్తోంది.మొత్తానికి చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ కోసం ఆసీస్ రెడీ అవుతోంది. కనీసం ఈ మ్యాచ్ లోనైనా నెగ్గి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. అటు భీకరమైన ఫామ్ లో ఉన్న టీమిండియా మరోసారి రెచ్చిపోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్ లో నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది