ఆరు నెలల్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ. 3.86 లక్షల కోట్లు

పెద్దనోట్ల రద్దు, జీఎస్టీపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆదాయం పెరిగిందని చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం నెలల వారీగా, త్రైమాసికాలు, అర్ధ సంవత్సరం వారీగా లెక్కలు విడుదల చేస్తోంది. ప్రత్యక్ష పన్నుల ఆదాయం పెరిగిందని వివరిస్తోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఆదాయ పన్ను వసూళ్లు రూ. 3.86 లక్షల కోట్లుగా ఉంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 15.8 శాతం వృద్ధి నమోదైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) తెలిపిన వివరాల ప్రకారం.. బడ్జెట్ అంచనాలను అనుసరించి టార్గెట్ మొత్తంలో ఏప్రిల్-సెప్టెంబర్ కాలానికి 39.4 శాతం పన్ను వసూలైందని పేర్కొన్నది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు రూ. 1.77 లక్షల కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్‌గా వచ్చినట్లు తెలిపింది. గతేడాదితో పోల్చితే 11.5 శాతం వృద్ధి నమోదైంది. అదేవిధంగా కార్పోరేట్ ఇన్‌కం అడ్వాన్స్ ట్యాక్స్‌లో 8.1 శాతం, పర్సనల్ ఇన్‌కం అడ్వాన్స్ ట్యాక్స్‌లో 30.1 శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ. 9.8 లక్షల కోట్లను ప్రత్యక్ష పన్నుల వసూళ్ల ద్వారా రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.