ఆరుషి కేసులో తల్లిదండ్రులు నిర్దోషులు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 14 ఏళ్ల ఆరుషి తల్వార్ హత్య కేసులో బాలిక తల్లిదండ్రులను నిర్దోషులుగా తేల్చింది అలహాబాద్ హైకోర్ట్. తల్లిదండ్రులే ఆరుషిని హత్య చేశారనడానికి సరైన ఆధారాలు లేవని పేర్కొంది. బలమైన ఆధారాలు సమర్పించడంలో సీబీఐ విఫలమైందని  హైకోర్ట్ పేర్కొన్నది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ (సంశయ లాభం) కింద వారిని నిర్దోషులుగా ప్రకటించి, బెయిల్ మంజూరు చేసింది.

ఢిల్లీ శివార్లలోని నోయిడాలో 2008, మే 16న ఆరుషి తల్వార్ హత్య జరిగింది. పని మనిషి హేమరాజ్ హత్య చేసి ఉంటాడని అనుమానించగా, ఆ తర్వాత రోజే అతని శవం ఇంటి టెర్రస్ పై కనిపించింది. ఈ కేసులో ఆరుషి తల్లిదండ్రులను సీబీఐ నిందితులుగా పేర్కొన్నది. 2013లో ఆరుషి తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నూపుర్ తల్వార్ దంపతులకు కోర్ట్ జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఘజియాబాద్ జైలులో వారు శిక్ష అనుభవిస్తున్నారు. కింది కోర్ట్ తీర్పుని తల్వార్ దంపతులు హైకోర్టులో సవాల్ చేశారు. కోర్ట్ తీర్పు, బెయిల్ మంజూరుతో వారు విడుదల కానున్నారు.