ఆధునీకరించిన పాలేరు కాలువ రేపే ప్రారంభం

ఖమ్మం జిల్లా పాలేరు పాత కాలువ ఆధునీకరణ మరో చరిత్రను సృష్టించింది. కొత్త రికార్డులను నెలకొల్పింది. 20 నెలలలో జరగాల్సిన పనులు నాలుగు నెలలకే పూర్తి చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది. గత జూలై 15 నాటికి ఈ పనులు పూర్తయ్యాయి. అదే నెలలోనే ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కాలువ నుంచి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, మంత్రి తుమ్మల రేపు నీటిని విడుదల చేయనున్నారు. దీంతో 25 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.

పాలేరు పాత కాలువ ఆధునీకరణ పనుల్లో భాగంగా పూడిక తీశారు. కాలువలోని ఇతర శిథిలాలను, ఇరువైపులా ఉన్న రాయిని తీసేశారు. బ్లాస్టింగ్ ద్వారా బండరాళ్లనీ  తొలగించారు. కాలువ దారిలో పూర్తిగా శిథిలమైన 9 వంతెనలను పూర్తిగా తొలగించి డబుల్ లైన్ రోడ్ బ్రిడ్జి లను నిర్మించారు. కాలువపై ఉన్న 32 తూములను పూర్తిగా తొలగించి సిమెంట్ కాంక్రీటుతో కొత్త తూములను నిర్మించి వాటికి కొత్త గేట్లు అమర్చారు. శిథిలావస్థలో ఉన్న 7 అండర్ టన్నెల్ లను తొలగించి ఆ స్థానంలో కొత్త వాటిని నిర్మించారు. కాలువ నీటి నిర్వహణ, పంపిణీ క్రమబద్ధీకరణ కోసం 2 క్రాస్ రెగ్యులేటర్లను నిర్మించారు. కాలువపై ఉన్న  22 ఇన్ లెట్, ఔట్ లెట్ లను పూర్తిగా తొలగించారు. కాంక్రీటుతో వాటిని కొత్తగా నిర్మించారు. 3.9 కిలోమీటర్ల కాలువకు ఇరువైపులా కాంక్రీటుతో గోడలు నిర్మించారు. ఈ పనులు రికార్డు స్థాయి వ్యవధిలో పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ సిబ్బంది, వర్క్ ఏజెన్సీ సిబ్బంది, కార్మికులు మూడుషిఫ్టులు, రేయింబవళ్లు పని చేశారు.

పాలేరు పాత కాలువను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరింది. దీంతో  చివరి ఆయకట్టు వరకు నీళ్లు విడుదలయ్యే పరిస్థితి లేదు. పాలేరు పాత కాలువ సామర్థ్యం 250 క్యూసెక్కులైతే, శిథిలావస్థకు చేరడం వల్ల కేవలం 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే గండి పడే పరిస్థితి ఉండేది. పాలేరు పాత కాలువ నిర్మించి 95 సంవత్సరాలు కావడంతో కాలువ అడుగు భాగంలో 3 అడుగులకుపైగా పూడిక ఏర్పడింది. 360 రోజులు ఆన్ అండ్ ఆఫ్ పద్దతిలో నీరు ప్రవహిస్తున్నందున అడుగు భాగాన గుర్రపు డెక్క పెరిగి కాలువ ప్రవాహానికి అడ్డంకిగా మారింది.

సీఎం కేసీఆర్ కేబినెట్‌ లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కూసుమంచి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఆయకట్టు రైతులు పాలేరు పాత కాలువ గురించి మంత్రికి గోడు వెళ్లబోసుకున్నారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే పాలేరు పాత కాలువ పునరుద్ధరణ కోసం రూ.64 కోట్లు మంజూరు చేశారు. 2017 ఫిబ్రవరి 16న పాలేరు ఆధునీకరణ పనులకు మంత్రులు హరీశ్ రావు, తుమ్మల శంకుస్థాపన చేశారు. ఆరు నెలల్లోనే కాలువ లైనింగ్ పనులు పూర్తి చేస్తానని రైతులకు తెలంగాణ ప్రభుత్వం హామీనిచ్చింది. ఈ మేరకు రైతులు ప్రభుత్వంపై  నమ్మకంతో ఒక పంటను వదిలేసుకున్నారు. నాలుగు నెలల్లోనే పనులు పూర్తి చేసిన అధికారులకు, కార్మికులకు, గుత్తేదారుడికి మంత్రులు హరీశ్ రావు, తుమ్మల ప్రత్యేక అభినందనలు తెలిపారు.

పాలేరు పాత కాలువను 1922లో నిజాం ప్రభుత్వం నిర్మించింది. దీని పూర్తి ప్రవాహ సామర్ధ్యం 320 క్యూసెక్కు లు. 1969 లో పాలేరు చెరువును నాగార్జున సాగర్ ఎడమ కాలువతో అనుసంధానం చేశారు. పాలేరు చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా మార్చారు. పాలేరు రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం 2.5 టీఎంసీలు. ఈ ప్రధాన కాలువ మొత్తం  పొడవు 23.5 కిలోమీటర్లు. పాత కాలువ తూములు 32. వాటికింద ఉన్న పిల్ల కాలువల పొడవు 55 కిలోమీటర్లు. పాత కాలువ పరిధిలో నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో 10 రెవెన్యూ గ్రామాల రైతులకు సాగునీటి సౌకర్యం లభిస్తుంది. పాత కాలువ నుంచి మండరాజుపల్లి, సుద్దేపల్లి చెరువుల ద్వారా తాగునీరు అందుతుంది. నేలకొండపల్లి  మండలంలోని పలు గిరిజన గ్రామాలకు, తండాలకు తాగునీరు సమస్య పరిష్కారం అవుతుంది.