ఆదిలాబాద్ లో చురుగ్గా భగీరథ పనులు

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు ఆదిలాబాద్ పట్టణంలో యుద్ధ ప్రతిపాదికన కొనసాగుతున్నాయి. ఇంటింటికీ మంచినీళ్లందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పనులను గడువులోగా పూర్తి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో అధికారులు ముందుకు సాగుతున్నారు. శరవేగంతో పనులు జరిగేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఆదిలాబాద్‌ పట్టణంలో 36 వార్డులు ఉండగా, 25వేల వరకు నివాసగృహాలున్నాయి. కాలానుగుణంగా పట్టణ విస్తీర్ణంతోపాటు నివాసాలు సైతం అదే రీతిలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రజల తాగునీటి అవసరాలను తీర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకానికి అంకురార్పణ చేసింది. ఇందులో భాగంగా ఒక్కో మనిషికి 135 లీటర్ల శుద్ధనీటిని అందించనుంది. లక్ష జనాభా దాటిన పురపాలికలను కేంద్ర ప్రభుత్వం అమృత్‌ పథకం కింద ఎంపిక చేసింది. ఈ పథకం కింద ప్రభుత్వం అందజేసే రూ.వంద కోట్ల నిధుల్లో అధికభాగం అధికారులు తాగునీటి సమస్య పరిష్కారానికే కేటాయించారు. రూ.82.10కోట్ల నిధులు ఇందుకు కేటాయించారు. ఈ నిధులను భగీరథ పథకానికి అనుసంధానం చేశారు.

పట్టణంలో తాగునీటిని సరఫరా చేస్తున్న పాత రిజర్వాయర్లు ఏడు ఉండగా.. వీటికి అదనంగా మరో నాలుగు రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. సమీపంలోని దేవాపూర్‌ చెక్‌పోస్టు వద్ద నిర్మిస్తున్న రిజర్వాయరు నుంచి నీళ్లు నేరుగా పట్టణంలోని ఫిల్టర్‌ బెడ్‌ వరకు వస్తాయి. ఫిల్టర్ బెడ్ వద్ద మరో రిజర్వాయరు నిర్మించి అందులో నీటిని నిల్వ చేస్తారు. మరోవైపు కొత్త పైప్‌లైన్ల ద్వారా ఇంటింటికి నీరందించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలో 150 కిలోమీటర్ల  పైప్‌లైన్లను వేయనున్నారు.

జిల్లాకు చెందిన మంత్రి జోగు రామన్న మిషన్ భగీరథ నిర్మాణ పనుల పురోగతి పై ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్ధేశం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు మిషన్ భగీరథ నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

పట్టణంలో మిషన్‌ భగీరథ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రిజర్వాయర్ల పనులు జరుగుతున్నాయి. ఈ పనులను వచ్చే ఏడాదిలోపు పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ పనులు పూర్తయిన వెంటనే పట్టణవాసులకు తాగునీటి సమస్య శాశ్వతంగా దూరమవుతుందని ఆదిలాబాద్ పబ్లిక్ హెల్త్ విభాగం అధికారులు, మున్సిపల్ చైర్ పర్సన్ రంగినేని మనీషా తెలిపారు. మరోవైపు ఈ సంవత్సరం డిసెంబర్ నెల చివరి వరకు ఆదిలాబాద్ పట్టణంలో పైప్ లైన్ పనులతో పాటు ట్యాంక్ ల నిర్మాణం పనులు పూర్తి చేయాలని మంత్రి జోగు రామన్న అధికారులను అదేశించారు.