అరుదైన ఘనత సాధించిన జైపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం

మంచిర్యాల జిల్లాలోని జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం రికార్డు సాధించింది. దేశంలో ఎంపిక చేయబడిన 25 అత్యుత్తమ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 8వ ర్యాంకును సాధించింది. జాతీయ స్థాయిలో గల ఎలక్ట్రిసిటీ అథారిటీ ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇచ్చిన ర్యాంకులో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ ఘనత సాధించింది. గడచిన ఆరు నెలల కాలంలో అత్యధిక పి.ఎల్.ఎఫ్.సాధించిన 25 విద్యుత్ కేంద్రాలకు ర్యాంకులు ఇవ్వగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 86.87శాతం తో 8 వ స్థానం సాధించింది.

తెలంగాణ, ఏపీలోని ఏ ఇతర థర్మల్ కేంద్రానికి ఈ స్థాయి దక్కలేదు. రామగుండం సూపర్ థర్మల్ స్టేషన్ ఒక్కటే  82.04 పిఎల్ ఎఫ్ తో 19వ స్థానం దక్కించు కొగలిగింది. అటు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతీయ స్థాయిలో 8వ స్థానం సాధించడం పై సిఎండీ శ్రీధర్ సంతోషం వ్యక్తం చేసారు. ఇంతటి ఘనతను సాధించిన ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఇదే విధంగా ఉత్తమ పిఎల్ఎఫ్ తో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు.

కాగా జాతీయ స్థాయిలో ప్రకటించిన జాబితా లో పశ్చిమ బెంగాల్ కు చెందిన 750 మెగావాట్ల థర్మల్ విద్యుత్  కేంద్రం  99.77 శాతం పి.ఎల్.ఎఫ్ తొ ప్రధమ స్థానం లొ నిలిచింది. అటు సింగరేణి ఈ ఏడాదే కాకుండా ఫస్ట్ నుంచి ఉత్తమస్థాయిలోనే నిలిచింది. సింగరేణి సంస్థ సిఎమ్.డి శ్రీ ఎన్.శ్రీధర్ నిరంతర పర్యవేక్షణ, సమీక్షల ఫలితంగా థర్మల్ విద్యుత్ కేంద్రం మొదటినుంచి మంచి పి.ఎల్.ఎఫ్ తొ ముందుకు పోతోంది. ఆగస్టు 2017 లో అత్యధికంగా 98.43శాతం పి.ఎల్.ఎఫ్.తో రికార్డు సాధించింది. అలాగే  స్టేషన్ లో గల యూనిట్ -1  గత ఎప్రిల్  నెలలో 100 శాతం పి.ఎల్ ఎఫ్. సాధించగా యూనిట్ -2 గత  ఫిబ్రవరి, మే  నెలల్లో 100 శాతం పి.ఎల్.ఎఫ్ నమోదు చేసాయి.

జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం గత 6 నెలల కాలంలో 4,613 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి దానిలో 4,325 మిలియన్ యూనిట్లు గ్రిడ్ కు సరఫరా చేసింది. ఈ ప్లాంట్ ప్రారంభం నుండి ఈ సెప్టెంబర్ వరకు 8,862 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా 8,272 మిలియన్ యూనిట్లను రాస్ట్రావసరాలకు అందించింది.