7% లోపే వృద్ధిరేటు!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 7 శాతంలోపే నమోదుకానున్నదని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ డీబీఎస్ అంచనావేస్తున్నది. అంటే వృద్ధి మూడేండ్ల కనిష్ఠ స్థాయికి జారుకోనున్నదన్నమాట. దేశ ఆర్థిక పరిస్థితులు దిగజారడానికి రెండు పాలసీ నిర్ణయాలు కారణం అయ్యాయని డీబీఎస్ తాజా నివేదికలో పేర్కొంది. నవంబర్ 2016లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జూలై 1నుంచి అమలులోకి వచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తో స్వల్పకాలంపాటు స్పష్టమైన ప్రభావం కనిపించనున్నదని డీబీఎస్ రిసెర్చ్ రిపోర్టులో పేర్కొంది.  తయారీ రంగంలో నిస్తేజంతోపాటు పెట్టుబడులు తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో వృద్ధి 5.9 శాతానికి జారుకున్నది. గత ఏడాది ఇదే కాలానికి వృద్ధి 7.9 శాతంగా నమోదైంది. జూన్ త్రైమాసికంలో వృద్ధి నిరాశపరిచినప్పటికీ..ప్రస్తుత త్రైమాసికంలో కొంత ఆశాజనకంగా ఉండనున్నదని, మొత్తం మీద ఈ ఏడాది సరాసరిగా 6.8 శాతంగా నమోదు కావచ్చని డీబీఎస్ రిపోర్టు పేర్కొంది. ప్రైవేట్ రంగ పెట్టుబడులతోపాటు మౌలిక సదుపాయాల కోసం కేంద్రం పెట్టే ఖర్చులు అధికమైనప్పుడే ఏడు శాతం వృద్ధి సాధించే అవకాశం ఉందని తెలిపింది. పెద్ద నోట్ల రద్దుతో నగదు లభ్యత తగ్గుముఖం పట్టడంతో నిర్మాణం, వాణిజ్యం, లాజిస్టిక్, చిన్న-మధ్య తరహా పరిశ్రమలకు తీవ్రస్థాయిలో ఇబ్బందులు తప్పవని నివేదిక గుర్తించింది.