6 నెలల్లో 50 ప్రపంచ స్థాయి సదస్సులు

నాలుగు వందల ఏండ్ల ఘనచరిత్ర ఉన్న హైదరాబాద్ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. అంతర్జాతీయ సదస్సు అనగానే నిర్వాహకులు మన రాజధానివైపు చూస్తున్నారు. విదేశాల్లోని ప్రముఖ నగరాలను తలదన్నుతూ, దేశంలోని పట్టణాలతో పోటీపడుతూ జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు భాగ్యనగరం ఆతిథ్యమిస్తున్నది. వచ్చే ఆరునెలల్లో సుమారు 50 వరకు జాతీయ, అంతర్జాతీయస్థాయి సదస్సులకు హైదరాబాద్ వేదిక కాబోతున్నది.

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు, రోబోటిక్స్, ఐవోటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై సదస్సు, అంతర్జాతీయ టూరిజం సదస్సుకు హైదరాబాద్‌ వేదిక కానుంది. అంతేగాకుండా  105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్,ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ సెల్ బయాలజీని కూడా ఇక్కడే నిర్వహించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నగరాలను పక్కనపెట్టి….78వ స్కాల్ అంతర్జాతీయ సదస్సు, దేశంలోని ఇతర మెట్రోనగరాలను కాదని గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్, చైనా, ఫిలిప్పీన్స్ ను కాదని ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ సెల్ బయాలజీ ఒక్కొక్కటిగా హైదారాబాద్‌ను వేదికగా చేసుకున్నాయి.

ఆహ్లాదకరమైన వాతావరణం, పర్యాటకంగా ఘనచరిత్ర, మౌలిక సదుపాయాలు, చక్కటి ఆతిథ్యమే అభివృద్ధిలో హైదరాబాద్ దూసుకుపోతున్న తీరుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమావేశాలతో పెట్టుబడులు వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెంది ఉద్యోగావకాశాలు పెరుగుతాయని విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, పేరెన్నికగన్న ప్రైవేటుసంస్థల సర్వేలు, నివేదికల్లో హైదరాబాద్ ముందువరుసలో నిలుస్తున్నది. ఈ ఏడాది జేఎల్‌ఎల్ సిటీ మోమెంటమ్ ఇండెక్స్ లో హైదరాబాద్ ప్రపంచలోనే ఐదో మోస్ట్ డైనమిక్ సిటీగా నిలిచింది. లండన్ , ఆస్టిన్, హనోయ్ , బోస్టన్  నగరాలు హైదరాబాద్ తర్వాతే ఉన్నాయి. జనాభా, సాంకేతికత వినియోగం, పరిశోధన,అభివృద్ధి, విద్య, రియల్‌ఎస్టేట్, ఆధారంగా ఈ ర్యాంకు వచ్చింది. 2014, 2015, 2016 సర్వేల్లో టాప్ 10లో సైతం లేని హైదరాబాద్, 2017లో టాప్ 5లో నిలిచింది. ఈ ఏడాది మార్చిలో విడుదలచేసిన మెర్సర్ క్వాలిటీ ఆఫ్ ఇండెక్స్‌లో దేశంలో ఉత్తమ నగరంగా హైదరాబాద్ నిలిచింది. పర్యావరణ సూచికలోనూ ఇతర మెట్రోనగరాలతో పోల్చితే పరిస్థితి మెరుగ్గా ఉంది. ఇలా హైదరాబాద్ ఖ్యాతి ఇనుమడించడంతో ప్రపంచదేశాల ఈవెంట్ నిర్వాహకులు హైదరాబాద్‌లో కార్యక్రమాల నిర్వహణకు ఆసక్తి చూపుతున్నారు.

ఇండో అరబిక్ నిర్మాణశైలి నగరానికి ఆస్తిగా నిలిచింది. భిన్నత్వంలో ఏకత్వం, సోదరభావం, మతసామరస్యం వంటి అంశాలు హైదరాబాద్‌ను ఇతరదేశాల ముందు గెలిపిస్తున్నాయి. అరబ్, చైనీస్, బెంగాలీ, ఇరానీ, ఇతర గల్ఫ్ వంటలన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అనుకూల వాతావరణం, జాతీయస్థాయిలో ఇక్కడి పోలీసింగ్ విధానాలకు లభిస్తున్న బహుమతులు, మహిళలు, పర్యాటకుల భద్రతలో ప్రత్యేకశ్రద్ధ చూపడం ఆకర్షిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామికవిధానాలతో …..ప్రపంచస్థాయి కంపెనీలైన గూగుల్, అమెజాన్, డీబీఎస్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఉబర్ సంస్థలు హైదరాబాద్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేయడం కూడా  ఆకర్షిస్తున్నది.  హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు నవంబర్ 28-30 మధ్య జరుగనున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్ అధ్యక్షత వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరవుతారు.

ఎయిర్ పేరిట రోబోటిక్స్, ఐఓటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై సదస్సు అక్టోబర్ 10 నుంచి 13 వరకు హెచ్‌ఐసీసీలో జరగనున్నది. అంతర్జాతీయ టూరిజం సదస్సు అక్టోబర్ 5 నుంచి 9 వరకు జరగనున్నది.ఈ సదస్సులో 85 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు. 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జనవరి 3 నుంచి 7 వరకు జరుగనున్నది. ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ సెల్ బయాలజీ సదస్సు జనవరి 27 నుంచి 31 వరకు జరుగనున్నది.  సెప్టెంబర్ 21 నుంచి 22 వరకు గ్లోబల్ హెచ్‌ఎస్‌ఈ-2017 సదస్సు, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ సదస్సు , ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ సోషల్ ఇన్నోవేషన్ సదస్సు కూడా సెప్టెంబర్ 24న జరగనుంది. మార్చి వరకు మొత్తం సుమారు 50 జాతీయ, అంతర్జాతీయ సదస్సులు జరుగనున్నాయి.