2022 కల్లా 7లక్షల ఉద్యోగాలు ఫట్!

ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా 2022కల్లా దేశీయ ఐటీ, బీపీవో రంగాల్లో దాదాపు 7 లక్షల మంది సిబ్బంది తమ ఉద్యోగం కోల్పోవాల్సి రావచ్చని ఓ అధ్యయన నివేదిక హెచ్చరించింది. ఆటోమేషన్‌తో ప్రతికూల ప్రభావాలతోపాటు ప్రయోజనాలు కూడా ఉన్నాయని అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ హెచ్‌ఎఫ్‌ఎస్ రిసెర్చ్ తన రిపోర్టులో వెల్లడించింది. ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) విస్తరణ కారణంగా వచ్చే ఐదేండ్లలో తక్కువ నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చినప్పటికీ.. మధ్యస్థాయి, ఉన్నత స్థాయి నైపుణ్యంతో కూడిన ఉద్యోగావకాశాలు భారీగా పెరుగనున్నాయని నివేదిక పేర్కొంది. ఆటోమేషన్, ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ, బీపీవో సంస్థల్లోని తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగుల సంఖ్య 2022కల్లా 17 లక్షలకు తగ్గనుంది. గడిచిన ఏడాదిలో వీరి సంఖ్య 24 లక్షలుగా ఉందని హెచ్‌ఎఫ్‌ఎస్ రిపోర్టు వెల్లడించింది. అయితే మధ్య స్థాయి నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలు 2016లో ఉన్న 9 లక్షల నుంచి 2022కల్లా 10 లక్షలకు పెరుగవచ్చని, ఉన్నత స్థాయి నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలు 3.20 లక్షల నుంచి 5.10 లక్షలకు పెరుగవచ్చని నివేదిక అంచనా వేసింది. అన్ని స్థాయిలు కలిపి చూస్తే.. ఆటోమేషన్ కారణంగా ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో వచ్చే ఐదేండ్లలో నికరంగా 4.50 లక్షల ఉద్యోగాలు కోల్పోవాల్సి రావచ్చని హెచ్‌ఎఫ్‌ఎస్ రిసెర్చ్ నివేదిక అంచనా వేసింది. 2016లో 36.5 లక్షలుగా ఉన్న దేశీయ ఐటీ, బీపీవో ఉద్యోగుల సంఖ్య 2022లో 32 లక్షలకు తగ్గనున్నట్లు తెలిపింది.