15.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు

బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు ధరను సొంతం చేసుకుంది. లంబోధరుడి లడ్డూ ఈ ఏడాది ఏకంగా 15 లక్షల 60వేలు పలికింది. ఆది నుంచి హోరా హోరీగా సాగిన వేలం పాటలో  నాగం తిరుపతి రెడ్డి పెద్ద మొత్తంలో వేలం పాట పాడి బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. వెయ్యి నూట పదహార్లతో ప్రారంభమైన వేలం పాట.. చివర వరకూ ఉత్కంఠగా కొనసాగింది.

లడ్డూను సొంతం చేసుకునేందుకు 21మంది భక్తులు పోటీ పడ్డారు. గత ఏడాది వేలంలో పాల్గొన్న 17 మందితో పాటు కొత్తగా మరో 4 మంది లడ్డూను సొంతం చేసుకునేందుకు వేలంలో పాల్గొన్నారు. చివరకు అత్యధికంగా పాట పాడిన వనపర్తి జిల్లా నాగాపూర్ వాసి నాగం తిరుపతి రెడ్డి గణేష్ లడ్డూను  దక్కించుకున్నారు. బాలాపూర్ గణేశుడి లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. జీవితంలో ఒక్కసారైనా బాలాపూర్ లడ్డూను దక్కించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని ఇన్నాళ్లకు ఆ కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు.

బాలాపూర్ గణపతికి, ఆయన చేతి లడ్డూకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నగరానికి దక్కిన ఈ ఖ్యాతి, ప్రపంచం నలుమూలా ఆసక్తిని రేకెత్తించింది. ఏటా వచ్చే వినాయక చవితి పేరు చెబితే మొదటగా గుర్తొచ్చేది బాలాపూర్ గణేశుని లడ్డూనే. కోరిన కోర్కెలు నెరవేర్చే లడ్డూ’గా పేర్కొంటుంటారు బాలాపూర్ వాసులు. ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు ఏటా పోటీ పెరుగుతోంది. లడ్డూ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నారు. అంతేగాకుండా బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంపాటలో వచ్చిన డబ్బులతో ఆలయాల అభివృద్ధి చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. విద్యాలయాల్లో కూడా చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి నిధులను వినియోగిస్తున్నామంటున్నారు.

1980 నుంచి బాలాపూర్ వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. 1994లో వేలంపాట పెట్టగా గణేషుని లడ్డూ రూ.450 పలికింది. గతేడాది స్కైలాబ్‌రెడ్డి బాలాపూర్ గణేశుడి లడ్డూను రూ.14 లక్షల 65 వేలకు దక్కించుకున్నారు. క్రమంగా లడ్డూ వేలంలో విలువ పెరుగుతూ వస్తుందే కానీ తగ్గిన దాఖలాలు లేవు. ప్రతి ఏడాది వేలంపాటను ఉత్సవ కమిటీ చేపడుతోంది.