15న అర్చకులతో సీఎం కేసీఆర్ సమావేశం

ఈ నెల 15న మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో అర్చకులతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని నిశ్చయించారు. అర్చకుల జీతాల పెంపుదల, జీతాలు చెల్లించే విధానం, దూప దీప నైవేధ్యం నిర్వహణ ఎలా ఉండాలి? తదితర అంశాలపై గురువారం సమావేశమై ముసాయిదా రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

అర్చకుల వేతనాలు, ఆలయాల నిర్వహణకు సంబంధించి ప్రగతి భవన్లో సమీక్ష జరిగింది. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్చకులకు వేతనాలు చెల్లించడంతో పాటు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం ధార్మిక పరిషత్ ను ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత దేవాలయాల విషయంలో చాలా నిర్లక్ష్యం, వివక్ష జరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. దేవాలయాల నిర్వహణలో, అర్చకులకు జీతాలు చెల్లించే విషయంలో అన్యాయం జరిగిందన్నారు. పూర్వకాలంలో అప్పటి జాగీర్దార్లు, మహారాజులు దేవాలయాలకు భూములు ఇచ్చారని, ఆ భూములపైనే ప్రభుత్వం అజమాయిషీ చేస్తున్నది తప్ప కొత్తగా భూములిచ్చింది లేదని సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే యాదాద్రి, వేములవాడ దేవాయాలకు భూములు ఇచ్చామని, భద్రాద్రికి కూడా భూములు ఇస్తామని, దేవాలయాల అభివృద్ధికి బడ్జెట్లోనే నిధులు కేటాయించి ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. దేవాలయ భూముల పరిరక్షణ, ఆలయాల పరిరక్షణ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు.

యాదాద్రి, వేముల వాడ, భద్రాచలం తరహాలోనే బాసర ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. బాసరకు స్తపతులను పంపి, దేవాలయ అభివృద్ధికి సంబంధించి కార్యాచరణ రూపొందించనున్నట్లు వెల్లడించారు.