143 పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి

అక్టోబర్ 20 లోపు 143 పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని…. ఈ ప్రక్రియను అక్టోబర్ 3 వ తేదీ నుంచి మొదలుపెట్టాలని మంత్రి హరీష్ రావు కేంద్రప్రభుత్వాన్ని కోరారు. జలసౌధలో కేంద్ర జౌళి శాఖ కార్యదర్శి అనంతకుమార్ సింగ్‌తో ఆయన సమావేశమయ్యారు. మధ్య దళారులు,ట్రేడర్లు గోల్ మాల్ చేయకుండా రైతులను పక్కాగా వెరిఫై చేయాలని మంత్రి హరీష్ రావు కోరారు.  పత్తి మద్దతు ధర 4320 రూపాయలకన్నా  తగ్గిన వెంటనే సి.సి.ఐ రంగంలోకి దిగి  కొనుగోళ్ళు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ కార్యదర్శి పార్ధ సారధి , మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీ బాయి, జాయింట్ డైరెక్టర్ లక్ష్మణుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రైతులు  పత్తి  సేకరణకోసం కాటన్ ప్లకింగ్ యంత్రాలు ఉపయోగించేలా…..సబ్సిడీపై సరఫరా చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి హరీష్ రావు అభిప్రాయ పడ్డారు.  రాష్ట్రంలో పత్తి సాగు పెరుగుతున్న నేపథ్యంలో  తెలంగాణలోని ఈ-నామ్  మార్కెట్లలో   క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ లు ఏర్పాటు చేయాలని కోరారు.  పత్తి సేకరణ సందర్భంగా ప్లాస్టిక్ సంచులు వాడకుండా కాటన్ సంచులను పత్తి రైతులకు సబ్సిడీపై  సరఫరా చేయాలన్నారు. పత్తి కొనుగోలులో ఇబ్బంది లేకుండా అవసరమైన సిసిఐ సిబ్బందిని నియమించాలని…. సిబ్బంది కొరత ఉంటే మార్కెటింగ్ శాఖ నుంచి తాత్కాలిక ప్రాతిపదికపై కొందరిని సి.సి.ఐ ఎంగేజ్ చేసుకోవచ్చునని మంత్రి హరీష్ రావు సూచించారు.

సీజనులో జరిగే పత్తి క్రయ విక్రయాలను ప్రతి రోజు  సమీక్షించాలని అధికారులు పర్యవేక్షించాలని   మంత్రి కోరారు. రైతులు ఎక్కువ దూరం పత్తిని తీసుకొని వెళ్ళకుండా పండించిన ప్రాంతానికి దగ్గరలోని జిన్నింగ్  మిల్లులను నోటిఫై  చేయాలని కేంద్ర జౌళి శాఖ కార్యదర్శి  అనంతకుమార్ సింగ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.  నోటిఫై చేసిన కేంద్రాల పరిధిలోనే  ఆయా గ్రామాల రైతులు పత్తిని అమ్ముకేనేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సంవత్సరం పత్తి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలందిస్తుందని ఆయన మంత్రి హరీష్ రావుకు హామీ ఇచ్చారు.

మార్కెట్ యార్డుల్లో , కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేలా సి.సి.ఐని ఆదేశించాలని  మంత్రి హరీష్ రావు  కోరారు. వ్యవసాయ మార్కెట్ కమిటి కొనుగోలు కేంద్రాలు, జిన్నింగు మిల్లులలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వివరాలు, రైతులకు తెలిసే విధంగా అవసరమైన కరపత్రాలు, వాల్ పోస్టర్లు వెంటనే ముద్రించి ప్రచారం చేయాలని ఆదేశించారు.  సి.సి.ఐ అధికారులు కొనుగోలు కేంద్రాల నుంచి పత్తి తీసుకొని వెళ్లేందుకు అవసరమైన రవాణా టెండర్ల  ప్రక్రియను త్వరగా ముగించాలని కోరారు.