హైదరాబాద్ లో చీరెల పంపిణీకి సర్వం సిద్ధం  

బతుకమ్మ పండగ సందర్భంగా.. సీఎం కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకు చీరెలను కానుకగా అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహణకు ఎన్ని ఏర్పాట్లు చేశారు. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఈ నెల 18, 19, 20 తేదీల‌లో  బతుక‌మ్మ చీర‌లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు జీహెచ్ఎంసీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. హైద‌రాబాద్‌లో మొత్తం 7లక్షల 60 వేల 839 మంది మహిళ‌ల‌కు ఈ బతుకమ్మ కానుక అందనుంది. హైద‌రాబాద్ జిల్లాలోని 16 స‌ర్కిళ్ల పరిధిలోని 92 వార్డుల‌లో ఉన్న 688 రేష‌న్ షాపుల ప‌రిధిలో చీరెల పంపిణీ జరుగనుంది. ఇందుకోసం నగరంలోని 9 గోడౌన్‌లలో స్టాక్‌ల‌ను భ‌ద్రపరిచారు. సౌత్ జోన్‌లో మూడు, సెంట్ర‌ల్ జోన్‌లో నాలుగు, నార్త్ జోన్‌లో ఒక‌టి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఒక గోడౌన్‌ లో స్టాక్‌ను ఉంచారు. చౌక ధ‌ర‌ల దుకాణాల‌కు ద‌గ్గ‌ర‌లో ఉన్న 645 కమ్యూనిటీ హాళ్లు, ఇత‌ర భ‌వ‌నాల‌ను గుర్తించి చీరెలను పంపిణీ చేయ‌నున్నారు.

నగరంలోని 15 స‌ర్కిళ్ల‌లో చీర‌లను భ‌ద్ర‌ప‌ర్చ‌డం, పంపిణీ, త‌దిత‌ర ఏర్పాట్ల‌ను పర్యవేక్షించ‌డానికి స‌ర్కిల్ స్థాయి ప్ర‌త్యేక క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. అలాగే 84 సూప‌ర్‌ వైజ‌రీ కమిటీల‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌తి వార్డుకు జీహెచ్ఎంసికి చెందిన డిప్యూటీ ఇంజ‌నీర్లు, ఏసీపీలు, మెడిక‌ల్ ఆఫీస‌ర్లను ఇన్‌చార్జీలుగా నియ‌మించారు. అటు ప్ర‌తి చౌక ధర‌ల దుకాణాల పరిధిలో.. స్థానిక శానిట‌రి జ‌వాన్‌, ఎంట‌మాల‌జిస్ట్‌, ఎస్‌.ఎఫ్‌.ఏ తోపాటు అంగన్‌ వాడి వర్క‌ర్‌, వీఆర్వో, స్ల‌మ్‌ లెవెల్ ఫెడ‌రేష‌న్, టౌన్‌ లెవెల్ ఫెడ‌రేష‌న్ ప్రతినిధులతో కూడిన చీర‌ల పంపిణీ క‌మిటీల‌ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. ఆహార భద్ర‌త కార్డు ఉన్న మ‌హిళా లబ్దిదారుల‌కు బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేయనున్నారు. చీరెల పంపిణీ సమయంలో.. మ‌హిళ‌లు తమ గుర్తింపుగా ఆధార్‌ కార్డు లేదా ఫోటో గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీని విధిగా సమర్పించాల్సి ఉంటుంది.

చీర‌ల పంపిణీని ప్రజాప్రతినిధుల స‌మ‌క్షంలో నిర్వ‌హించాల‌ని జీహెచ్ఎంసీ కమిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌ రెడ్డి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్ప‌టికే చీర‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహణ‌పై డిప్యూటి క‌మిష‌న‌ర్ స్థాయిలో ప్ర‌త్యేక స‌మీక్ష స‌మావేశాల‌ను ఏర్పాటు చేశారు. పౌర స‌ర‌ఫ‌రాల శాఖ నుంచి అందిన ల‌బ్దిదారుల జాబితా ఆధారంగా బతుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేయ‌నున్నారు.  పంపిణీ కేంద్రాల వ‌ద్ద త‌గు బందోబ‌స్తు, మంచినీరు తదిత‌ర మౌలిక స‌దుపాయాలు కల్పించనున్నారు. అలాగే ల‌బ్దిదారుల సౌకర్యార్థం త‌గు బ్యాన‌ర్లు, మొబైల్ వైద్య బృందాల ఏర్పాటు చేయాల‌ని క‌మిష‌న‌ర్ ఆదేశాలు జారీచేశారు.