హైదరాబాద్ లో కుండపోత వర్షం

కుండపోత వానతో జంటనగరాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.  భారీ వర్షంతో హైదరాబాద్ ఆగమాగమైంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దాదాపు 8 సెంటీమీటర్ల వానపడింది.  లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయి. పలు కాలనీల్లోని ఇండ్లలోకి నీరు చేరింది. వర్షపు నీటికి నాలాలన్నీ పొంగిపొర్లాయి. ముఖ్యంగా ఉప్పల్, నాచారం ఏరియాలో రహదారులు చెరువులను తలపించాయి.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎస్‌ ఆర్ నగర్, కూకట్ పల్లిలో భారీ వర్షం కురిసింది.  సికింద్రాబాద్, ముషీరాబాద్, కవాడిగూడ, నిజాంపేట్ లో కుంభవృష్టి పడింది. మల్కాజ్ గిరి, మౌలాలి, నాచారం, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్, అంబర్ పేట్..   ఎడతెరిపి లేని వానతో ఆగమాగమయ్యాయి.  భారీ వర్షం ధాటికి మల్కాజ్‌ గిరిలోని బండచెరువు నిండి పొంగిపొర్లింది. దీంతో రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. ఈస్ట్ ఆనంద్ బాగ్, షిరిడీనగర్ కాలనీలోని ఇండ్లలోకి నీరు చేరింది. బేగంపేట మయూరి మార్గ్, అల్లంతోట బావి, అంధుల స్కూల్ లో నీరు నిలిచిపోయింది.

ఉప్పల్ లో భారీ వర్షం కురిసింది. కుండపోత వానతో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. స్వరూప్ నగర్, ద్వారక నగర్, రాఘవేంద్ర కాలనీతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. వరద ఉదృతితో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

నాచారంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కుండపోత వర్షానికి రోడ్లపై వరద పోటెత్తింది. నాలాలు పొంగిపోర్లాయి.  లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయి. పలు చోట్ల ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు కాలనీల్లో రోడ్లపై వాహనాలన్నీ నీట మునిగాయి.

 భారీవర్షానికి బేగంపేటలో రోడ్లన్నీ కాలువలను తలపించాయి. నాలాలన్నీ పొంగిపొర్లాయి. పలు కాలనీలలో ఇండ్లలోకి నీళ్లు చేరాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.  రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చందానగర్ లో చాలా ఇళ్లు నీట మునిగాయి. ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరింది. సామన్లన్నీ తడిసిపోయాయి. కొన్ని ఇళ్లలో కనీసం నిల్చోవడానికి  కూడా వీలులేకుండా వరద పోటెత్తింది. దీంతో జనం రాత్రంతా తీవ్ర అవస్థలు పడ్డారు. కంటిమీద కునుకు లేకుండా జాగారం చేశారు.

మదీనాగూడలో వరద నీటితో రోడ్లన్నీ కుంటలను తలపించాయి.  దీప్తిశ్రీనగర్‌ కాలనీలో పలు భవనాలు నీట మునిగాయి. ముఖ్యంగా వరద ఉదృతి దెబ్బకు పలు అపార్ట్స్ మెంట్ల లోని సెల్లార్లలోకి నీరు చేరింది. దీంతో అపార్ట్‌ మెంట్ వాసులు కిందకి రాలేని పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో భవన యజమానులు ప్రైవేట్ జెనరేటర్లను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.

భాగ్యనగరంలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురియడంతో జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. సహాయక చర్యలను అనుక్షణం సమీక్షించారు. దీంతో రెస్క్యూ టీమ్స్, సిబ్బంది రంగంలోకి దిగారు.  లోతట్టు ప్రాంతాల్లో  ఫైర్, రెవెన్యూ శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు.  లోతట్టు ప్రాంతాల్లో చేరిన వర్షపు నీటిని సిబ్బంది ఎక్కడికక్కడ క్లియర్ చేశారు.

భారీ వర్షానికి లాలాపేట జలమయం కావడంతో మంత్రి పద్మారావు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అధికారులను అప్రమత్తం చేసి… లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లను ఖాళీ చేయించారు. ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. నిరాశ్రయులైన జనానికి అండగా మేమున్నామంటూ ప్రభుత్వం తరపున భరోసా ఇచ్చారు. ఇంత పెద్ద వర్షం కురిసినప్పటికీ జనానికి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జీహెచ్ఎంసీ స్పందించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  రోడ్లపై నీరు లాక్ కాకుండా తీసుకున్న చర్యలు బాగున్నాయంటున్నారు జనం . జీహెచ్ఎంసీ పనితీరు భేష్ అని  మెచ్చుకుంటున్నారు.