హైదరాబాద్ లో అఖిల భారత డ్వాక్రా బజార్ ప్రారంభం

హైదరాబాద్ లో అఖిల భారత డ్వాక్రా బజారుని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఉద్యోగంపై ఆధారపడకుండా సొంతంగా తయారు చేసిన వస్తువులను  అమ్ముకోవడానికి మహిళలకు ఇదొక మంచి అవకాశం అని మంత్రి అన్నారు. ఫ్యాక్టరీలలో తయారు చేసినవి కాకుండా పల్లెలలో సొంతంగా నేర్చుకొని తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దూరం వెళ్లి అమ్ముకోవడానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వివిధ రాష్ట్రాలకు చెందినవాళ్లు ఒకే దగ్గర అమ్ముకోవడానికి ఈ స్టాళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ దొరికే వస్తువులు మార్కెట్లో అయితే రెట్టింపు ధర ఉంటాయని, ఇక్కడైతే తక్కువ ధరకు అమ్ముతారని తెలిపారు. కొనుగోలుదారులకు ఇది చక్కటి అవకాశం అన్నారు. గ్రామాల్లో ఉండే నిరుద్యోగులు తామే సొంతంగా తయారు చేసుకొని మార్కెట్ చేసుకోవచ్చు కాబట్టి నిరుద్యోగ యువత కొత్త ఆలోచనలతో అడుగులు వేయాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరస్ పేరిట అఖిల భారత డ్వాక్రా బజార్ ఐ మాక్స్ థియేటర్ ముందు ఉన్న హెచ్ఎండిఎ గ్రౌండ్ లో నిర్వహిస్తోంది. 20 రాష్ట్రాల నుండి వచ్చిన గ్రామీణ మహిళా చేతి వృత్తుల ప్రదర్శన, అమ్మకాలకు దాదాపు 300 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇవాళ్టి నుండి ఈ నెల 25 తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది.

ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ , సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పౌసుమి బసు, అధికారులు పాల్గొన్నారు.