హాకీ కోచ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

భారత హాకీ జట్టు ప్రధాన కోచ్ పదవికి భారత హాకీ సమాఖ్య (హెచ్‌ఐ) దరఖాస్తులను ఆహ్వానించింది. బీసీసీఐ తరహాలో తొలిసారి అధికారిక వెబ్‌సైట్ ద్వారా హెచ్‌ఐ ప్రకటన జారీ చేసింది. దరఖాస్తులు సమర్పించేందుకు ఈనెల 15వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. కొత్తగా ఎంపికయ్యే కోచ్ మూడేండ్ల వరకు అంటే టోక్యో ఒలింపిక్స్ వరకు జట్టుతో ఉంటాడు. దీంతో పాటు జాతీయ సీనియర్ జట్టు ఒలింపిక్స్ అర్హత సాధించేందుకు చీఫ్ కోచ్‌దే బాధ్యత అని నోటిఫికేషన్‌లో తెలిపింది. అటు హాకీ జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన రోలెంట్ ఓల్ట్‌మన్స్ స్థానాన్ని భర్తీ చేసేది తానేనని జూనియర్ జట్టు కోచ్ హరేంద్రసింగ్ అన్నాడు. తన శిక్షణలో జాతీయ జూనియర్ జట్టుకు ప్రపంచకప్ అందించిన హరేంద్రసింగ్.. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ రేసులో ముందున్నాడు. హాకీలో తనకున్న అపార అనుభవమే అంతర్జాతీయ కోచ్‌ల కంటే మిన్నగా పోటీలో నిలిచేందుకు దోహదపడుతుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.