స్వార్ధ బుద్దిని బయటపెట్టుకున్న ఏపీ ప్రబుత్వం

ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు అనుకూలంగా వ్యవహరిస్తోందని మరోసారి బట్టబయలైంది. తాగు నీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. జూలై వరకు తాగునీటి అవసరాల కోసం 20.740 టీఎంసీల నీరివ్వాలని తెలంగాణ నీటిపారుదల శాఖ లేఖలో కోరింది. తాగునీటి అవసరాలకు అనుగుణంగా శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా నది యాజమాన్య బోర్డు సంప్రదించింది. అందుకు పలు కారణాలు వెలిబుచ్చుతూ ఏపీ సర్కార్ నిరాకరించింది. కర్నూలు జిల్లాలో నిర్మించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి నీరు కావాలని.. తెలంగాణకు తాగు నీరివ్వడం కుదరదని బోర్డుకు రాసిన లేఖలో ఏపీ ఈఎన్సీ పేర్కొంది.

శ్రీశైలం నుంచి నీరివ్వడం కుదరదని చెప్పిన ఏపీ సర్కార్.. ఓ ఉచిత సలహాకూడా ఇచ్చింది. నాగార్జున సాగర్లో 115 టీంఎంసీల నీళ్లు ఉన్నందున.. డ్రెడ్జింగ్ పద్దతిలో పనులు చేసి నీరు వాడుకోవాలని సలహా ఇచ్చింది. దీనిలోనూ మరో మెలిక పెట్టింది.. మున్ముందు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయాల్సి వస్తే హైదరాబాద్ తాగునీటికి గండి కొట్టేలా ఏపీలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలను తెరపైకి తెస్తామని పరోక్షంగా హెచ్చరించింది.  ముచ్చుమర్రి ద్వారా అనంతపురం, కర్నూలు జిల్లాల తాగు నీటి అవసరాలు తీరే వరకు దిగువకు నీరు వదిలేది లేదని తేల్చి చెప్పిది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం రాసిన లేఖ నిన్న కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అందింది. ఆ లేఖను అలాగే తెలంగాణ ప్రభుత్వానికి ఫార్వర్డ్ చేసి చేతులు దులుపుకున్నారు బోర్డు అధికారులు.

అసలు విషయానికొస్తే కర్నూలు జిల్లాలో నిర్మించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి బోర్డు అనుమతి లేదు. అయినా దాన్ని మొదలుపెడుతామంటూ ఏపీ లేఖలో స్పష్టం చేసింది. అయినా ఆ అంశాన్ని బోర్డు చూసి చూడనట్లు వదిలేసింది. బోర్డు ద్వారా వెళ్లిన ప్రతిపాదనపై కూడా ఏపీ జల వనరుల శాఖ నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అనుమతులు లేకపోయినా అనుకున్నట్లుగానే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభించుకుంది ఏపీ సర్కార్. ఏపీ వైఖరితో.. రాష్ట్రంలోని హైదరాబాద్ మహా నగరంతో పాటు నల్లగొండ జిల్లాలోని వందలాది ఫ్లోరైడ్‌పీడిత ప్రాంతాలకు నీటి కొరత ఎదురవుతున్నది. తెలంగాణ తాగునీటి విషయంలో కృష్ణాబోర్డు ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తుంది. శ్రీశైలం నీటినుంచి రెండు టీఎంసీలు ఇస్తే అవసరాలు తీరుతాయని కృష్ణాబోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మొరపెట్టుకోగా.. క్షేత్రస్థాయి పరిస్థితులను బోర్డు కూడా గమనించింది. అంతా చూసిన బోర్డు.. నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేయకుండా ఏపీని ఫోనులో సంప్రదించారు. ఈ ఉదాసీనతే ఏపీకి అనుకూలంగా మారింది.తాజా పరిణామాలతో పాటు శ్రీశైలం జలాశయానికి వచ్చిన ఇన్‌ఫ్లో తదితర అంశాలపై నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.