సింగరేణిపై గులాబీ జెండా ఎగరేస్తాం

సింగ‌రేణిపై గులాబి జెండాను ఎగుర‌వేస్తామ‌న్నారు తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం గౌర‌వాధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి క‌ల్వకుంట్ల క‌విత. సింగ‌రేణి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు హైద‌రాబాద్ తెలంగాణ భ‌వ‌న్‌ లో టిబిజికెఎస్ నాయ‌కులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎంపి క‌విత వారిని ఉద్దేశించి మాట్లాడారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో సింగ‌రేణిలో ప‌నిచేస్తున్న వారు కార్మికులు కాదని, వారు సైనికుల‌న్నారు ఎంపీ కవిత. సింగ‌రేణి సైనికుల కష్టాలు ఆయ‌న‌కు తెలుసున‌న్నారు. వెన‌క‌టి రోజుల్లో బ‌త‌కడానికి పోవాలంటే దుబాయ్ లేదంటే బొగ్గుబాయి నౌఖ‌ర్లు మాత్రమే ఉండేవ‌న్నారు. ప్రాణాల‌కు తెగించి, అండ‌ర్ గ్రౌండ్‌ లోకి వెళ్లి మ‌నంద‌రికి వెలుగులు పంచుతున్న సింగ‌రేణి కార్మికుల జీవితాల్లో వెలుగు చూడాల‌న్నదే ముఖ్యమంత్రి క‌ల అన్నారు. 2001 నుంచి కేసీఆర్ వెన్నంటి సంఘం ఉందని గుర్తుచేశారు.

2009, న‌వంబ‌ర్ 29న క‌రీంన‌గ‌ర్ అల్గునూరు చౌర‌స్తాలో కేసీఆర్ ను అరెస్ట్ చేసిన‌ప్పుడు ప‌నులు మానేసి నిర‌స‌న తెలిపిన గొప్ప చ‌రిత్ర సింగ‌రేణి కార్మికుల‌ద‌న్నారు ఎంపి క‌విత‌. ఆర్‌జి 2, 7ఎల్ ఇపి లో జ‌రిగిన గ‌ని ప్రమాదంలో 17 మంది కార్మికులు చ‌నిపోతే… హుటాహుటిన గ‌ని వ‌ద్దకు వెళ్లి బాధితుల‌ను కేసీఆర్ ప‌రామ‌ర్శించారని గుర్తుచేశారు. త‌ర్వాత వచ్చిన అప్పటి సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ కు అడ్డం ప‌డితే టిబిజికెఎస్ నాయ‌కుల‌పై కేసులు పెట్టించార‌ని, వారి పోరాట ఫ‌లితంగానే దేశంలో మొట్టమొద‌టిసారి 6 ల‌క్షలు ఎక్స్ గ్రేషియాను ఇప్పించుకున్నామ‌ని క‌విత వివరించారు. అలాగే గ‌నిలో కార్మికుడు చ‌నిపోయిన‌ప్పుడు మ్యాచింగ్ గ్రాంట్‌ ను న‌వంబ‌ర్ 2015 నుంచి 20 ల‌క్షలు ఇప్పిస్తున్న విష‌యం కార్మిక‌లోకానికి తెలుసున‌న్నారు.

ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికులు 35 రోజుల పాటు స‌మ్మె చేస్తే ఆ కాలానికి జీతం ఇవ్వడ‌మే కాకుండా… తెలంగాణ ఇంక్రిమెంట్‌ ను ఇప్పించుకున్న ఘ‌న‌త తెలంగాణ బొగ్గుగ‌ని కార్మిక సంఘానిదేన్నారు కవిత. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎఐటియుసి నాయ‌కులు ఎవ‌రికోసం ప‌నిచేశారో అంద‌రికి తెలిసిందేన‌న్నారు. వేజ్‌ బోర్డు ద్వారా మెరుగైన జీతాలు పెంచుతామంటున్న జాతీయ సంఘాలు ఇన్నాళ్లు ఎక్కడికి పోయాయ‌ని క‌విత ప్రశ్నించారు. 9వ వేజ్ బోర్డులో 25 శాతం వేత‌నాలు పెంపుకు ఒప్పందం చే‌సుకున్న జాతీయ సంఘం, ఈసారి 20 శాతానికి అంటే 5 శాతం త‌గ్గించుకోవ‌డం వెనుక మ‌త‌ల‌బు ఏంటో కార్మికుల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

విరామ‌మే త‌ప్ప ఫుల్‌ స్టాప్ కాదు

సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల భ‌ర్తీకి ఫుల్‌ స్టాప్ పెట్టార‌ని టిబిజికెఎస్‌ పై అస‌త్య ప్రచారం చేస్తున్నార‌ని ఎంపీ కవిత అన్నారు. కోర్టులో కేసు ఉన్న నేప‌థ్యంలో ఆ విష‌యానికి విరామ‌మే త‌ప్ప ఫుల్‌ స్టాప్ పెట్టిన‌ట్లు కాద‌న్నారు‌. డిపెండెంట్ ఉద్యోగాల విష‌య‌ంలో కార్మికుల్లో అపోహ‌లు పెంచింది ఆ సంఘాలేన‌న్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిపెండెంట్ ఉద్యోగాల‌కు ఫుల్‌ స్టాప్ పెట్టించింది ఎఐటియుసి కాదా అని ఎంపి క‌విత ప్రశ్నించారు. వారికి ఇప్పుడు డిపెండెంట్ ఉద్యోగాల గురించి మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌న్నారు. డిపెండెంట్ ఉద్యోగాలను అడ్డుకోవడానికి కోర్టుకు పోయిన వాళ్లు కాంగ్రెస్ నేత‌ల అనుచ‌రులు, ఎఐటియుసి నాయకుల బంధువులేన‌న్నారు.

వారిది కార్మిక వ్యతిరేక పొత్తు
తెలంగాణ బొగ్గుగ‌ని కార్మిక సంఘాన్ని ఓడించాల‌నే ల‌క్ష్యంతో ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, హెచ్ఎంఎస్‌, టిఎన్‌టియుసి సంఘాలు కూట‌మిగా ఏర్పడ్డాయ‌ని, ఆ కూట‌మి కేసీఆర్ వ్యతిరేక కూట‌మి కాద‌ని, అది కార్మిక వ్యతిరేక కూట‌మ‌ని ఎంపి క‌విత స్పష్టం చేశారు. నామినేష‌న్లకు ముందే ఎఐటియుసి నేత‌లు ఓట‌మి భ‌యంతో ఏవేవో మాట్లాడుతున్నార‌ని క‌విత ఎద్దేవా చేశారు. సింగ‌రేణి కార్మికుల నోటికాడ బుక్కను తీసేసిన ఎఐటియుసికి ఓట‌మి త‌ప్పద‌న్నారు. బాణం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో టిబిజికెఎస్‌ ను గెలిపించాల‌ని ఎంపి క‌విత సింగ‌రేణి కార్మికుల‌ను కోరారు. టిబిజికెఎస్ మేనిఫెస్టోను త్వరలో ప్రక‌టిస్తుంద‌ని తెలిపారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ స‌ల‌హాదారు జి. వివేక్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌, పెద్దప‌ల్లి ఎంపిలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప‌సునూరి ద‌యాక‌ర్‌, బాల్క సుమ‌న్‌, ఎమ్మెల్సీలు పురాణం స‌తీశ్‌, నార‌దాసు ల‌క్ష్మణ్ రావు, ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ సోమార‌పు స‌త్యనారాయ‌ణ‌, సింగ‌రేణి ప్రాంత ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య‌, క‌నక‌య్య‌, న‌ల్లాల ఓదెలు, దివాక‌ర్ రావు, జ‌ల‌గం వెంక‌ట్రావు, టిబిజికెఎస్ నేత‌లు వెంక‌ట్రావు, రాజిరెడ్డి, కెంగ‌ర్ల మ‌ల్లయ్య‌, క‌న‌క‌రాజు పాల్గొన్నారు.