సావిత్రి గెటప్‌లో కీర్తి!

తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం సావిత్రి. నాగ్ అశ్విన్ దర్శకుడు. కీర్తి సురేష్ టైటిల్ రోల్‌ని పోషిస్తున్నది. సమంత, దుల్కర్ సల్మాన్, ప్రకాష్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు చిత్రసీమపై చెరగని ముద్రవేసిన సావిత్రి జీవిత కథ కావడంతో ఈ సినిమాపై యావత్ ప్రేక్షకలోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ముఖ్యంగా సావిత్రి గెటప్‌లో కీర్తి సురేష్ ఎలా వుంటుందోనని ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్‌మీడియాలో దర్శనమిచ్చాయి. సావిత్రి గెటప్‌లో వున్న కీర్తి సురేష్ ఫొటోలు సాంఘిక మాధ్యమాల్లో ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. సావిత్రి గెటప్‌లో కీర్తి సురేష్ అద్భుతంగా వుందంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై స్వప్నదత్ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.