సర్ధార్ సరోవర్ డ్యామ్ జాతికి అంకితం  

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పుట్టినరోజు కానుకగా దేశంలో బృహత్తర ప్రాజెక్టుకు నేడు ప్రారంభోత్సవం జరిగింది. గుజరాత్‌లోని నర్మద జిల్లా కెవాడియాలో కావేరి నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యామ్‌ను ప్రధాని మోడీ ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. ఆరు దశాబ్దాల క్రితం మాజీ దివంగత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రు 5 ఏప్రిల్, 1961న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. పలు అవాంతరాలను అధిగమించి ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేటికి జరిగింది. ఈ డ్యామ్ ప్రపంచంలోనే రెండో పెద్ద ప్రాజెక్టు. యూనైటెడ్ స్టేట్స్‌లో ఉన్న గ్రాండ్ కౌలీ డ్యామ్ మొదటిది.

సర్దార్ సరోవర్ డ్యామ్ పొడవు 1.2 కిలోమీటర్లు. జలాశయం లోతు 163 మీటర్లు. దాదాపు 30 గేట్లు ఉన్న సరోవర్ డ్యాంలో ఒక్కో గేటు బరువు 450 టన్నులు. ఒక గేటు ముయాలంటే గంట సమయం పడుతుంది. 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం. ఈ విద్యుత్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌ల పంపిణీ జరుగుతుంది. మహారాష్ట్రకు 57 శాతం, మధ్యప్రదేశ్‌కు 27 శాతం, గుజరాత్‌కు 16 శాతం చొప్పున విద్యుత్ పంపిణీ జరగనుంది. ప్రాజెక్ట్ ద్వారా 10 లక్షల రైతులకు ప్రయోజనం కలగనుంది. దాదాపు 4 కోట్ల మందికి తాగునీరు అందనుంది.