సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్న సమగ్ర భూసర్వే

రైతును రాజుగా చేసేందుకు ముందుగా భూ రికార్డలను సమూలంగా ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ రికార్డుల్లో ప్రధానంగా పహాణీ, 1బీ తదితర రికార్డులను తయారు చేయడానికి పలు సూచనలు జారీ చేసింది. లోపాల సవరణకు తహసిల్దార్‌ పర్యవేక్షణాధికారిగా కమిటీని నియమిస్తారు. ఈ కమిటీకి గిర్దావర్‌ టీమ్‌ లీడర్‌ గా వ్యవహిరిస్తారు. సర్వేయర్‌, నలుగురు ఇతర గ్రామాల వీఆర్వోలు, సబంధిత గ్రామ వీర్వో, సహాయ సిబ్బంది సభ్యులుగా ఉంటారు.

ప్రస్తుత రికార్డుల్లో ఉన్న పహాణీలో లోపాలు గుర్తించి, సవరించేందుకు ప్రధానంగా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. సర్వే నెంబర్ల మార్పుతో పాటు 1బీ జనరేట్‌ అయ్యేందుకు ప్రత్యేక అక్షరాలు గల సర్వే నెంబర్లను తొలగించాలి. పట్టదారు చనిపోయి ఉంటే సర్వే నెంబర్ల వారసులను గుర్తించి, విరాసత్‌, రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసిన సర్వే నెంబర్లకు మ్యుటేషన్లు చేయాలి. రికార్డుల్లో ఉండి, మోఖాపై లేని బినామీలను గుర్తించడం, తద్వారా ప్రభుత్వం నుంచి రాయితీ, ఆర్థిక సాయం పొందకుండా చూడాల్సి ఉంటుంది. అన్ని సర్వే నెంబర్లలోని సబ్ డివిజన్‌ విస్తీర్ణాన్ని సేత్వారి, ఖాస్రా, పాత పహాణీ ప్రకారం సరిపోల్చి చూడాలి. రైతు వాస్తవంగా మోఖాపై గల సర్వే నెంబర్‌, రికార్డుననుసరించి తేడాగా ఉంటే సవరించాలి.

ఇక 1 బీ ప్రక్షాళనలో.. మృతి చెందిన ఖాతాదారులను గుర్తించి వారి వారుసులను మ్యూటేషన్‌ చేయాలి, ఖాతాలోని మొత్తం భూములను అమ్ముకున్న నామినల్‌ ఖాతాదారులను గుర్తించాలి. ఖాతాదారులు అమ్ముకున్న భూములను సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేసే సమయంలో వాటిని వెబ్‌ ల్యాండ్‌ 1బీ ప్రకారం సవరించుకోవాలి. తేడా ఉంటే పెన్సిల్‌ తో రౌండప్‌ చేసుకోవాలి. గ్రామంలోని చివరి ఖాతా నెంబర్‌ను నోషనల్‌ ఖాతాదారులను ఇస్తూ వెబ్‌ ల్యాండ్‌లో సవరణ చేపట్టాలి. 1 బీ లభ్యంకాని వాటికి సంబంధించి వెబ్‌ ల్యాండ్‌ 1 బీ రైతుల వద్ద ఉన్న పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్‌  డీడ్‌, మోఖాను పరిశీలించిన తర్వాత 1 బీని పునరుద్ధరించాలి. పట్టాదారు ఆధార్‌, మొబైల్‌, నెంబర్‌ను ఖాతా నెంబర్‌ కింద నమోదు చేయాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత పహాణీ, 1బీ వివరాలను  గ్రామ సభ ఏర్పాటు చేసి చదివి వినిపించాలి. గ్రామ సభ నిర్వహించే తేదిని ముందుగా చాటింపు చేయించాలి. తదుపరి ఏవైనా అభ్యంతరాలు వచ్చినట్లయితే నిబంధనలకు లోబడి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయడానికి చర్యలు చేపట్టాలి. సవరించిన రికార్డులను వెబ్‌ ల్యాండ్లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలి.

భూ రికార్డు ప్రక్షాళన 15 నుంచి మొదలవనుండగా..14న గ్రామంలో చాటింపు వేయించాలి. గ్రామ సర్వే నెంబర్లు, విస్తీర్ణం అనుసరించి ఒకటి, రెండు బృందాలను ఏర్పాటు చేసుకోవాలి. ఖాస్రా పహాణీ, సేత్వారీ, పాత పహాణీ, ఆర్‌ఎస్ఆర్ పహాణీ, మాన్యువల్‌, వెబ్‌ ల్యాండ్‌, 1బీ, గ్రామ పటంతో సిద్ధంగా ఉండాలి. వీఆర్వో, గిర్దావర్‌ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ పహాణీ, 1బీ ప్రింటవుట్లను, సర్వే నమూనాలను ప్రతీ రైతుకు అందించి సంతకం తీసుకోవాలి. తదనుగుణంగా సర్వీస్‌ సిబ్బంది పహాణీ, 1బీ రెండో ప్రతిలో సవరణ చేయాలి. మోఖా పరిశీలన చేయాల్సిన సర్వే నెంబర్లకు సంబంధించి సర్వే బృంద ఉద్యోగులు సంబంధిత రైతుల సమక్షంలో సర్వే జరిపి, అనుభవదారుల రికార్డులను తయారు చేయాలి. మోఖాపై భూమి, రికార్డులకు తేడా ఉంటే ఇద్దరు అనుభవదారులు పరస్పర అంగీకారంతో సరిచేసుకునే అవకాశం ఉన్న వాటిని సరిచేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాన్యువల్‌ పహాణీలో వీఆర్వో మార్పులు, చేర్పులు నమోదు చేయాలి. అన్ని ప్రభుత్వ భూములను ఎర్రసిరాతో రాయాలి.

లావణీ పట్టా భూములను వయలెట్‌ ఇంకుతో రాయాలి. సంబంధిత వీఆర్వో పహాణీలో అన్ని సర్వే సబ్‌ డివిజన్ల విస్తీర్ణ కాలం నెంబర్‌ 14 సేత్వారీ, ఖాస్రాలను అనుసరించి పోల్చుకోవాలి. పహాణీ ఫారంలో ఆధార్‌, మొబైల్‌ నెంబర్‌ను నమోదు చేసేలా చూడాలి.