సమాచార ప్రధాన కమిషనర్‌గా సదారాం

తెలంగాణ సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌గా డాక్టర్ రాజా సదారాం, కమిషనర్‌గా సీనియర్ జర్నలిస్ట్ బుద్దా మురళిని నియమించింది ప్రభుత్వం. సీఎం కేసీఆర్, జానారెడ్డి, మహమూద్‌ అలీ కమిటీ సమావేశమై వీరి పేర్లను ప్రతిపాదించారు. కమిటీ ప్రతిపాదనకు గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేయడంతో.. కమిషనర్లను నియమిస్తూ సీఎస్‌.. ఎస్పీ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆర్టీఐ ప్రధాన కమిషనర్‌గా నియమితులైన డాక్టర్ రాజా సదారాం స్వస్థలం వరంగల్. ఈయన 1976లో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో రిపోర్టర్‌గా విధుల్లో చేరారు. 2009 నుంచి ఎనిమిదేండ్ల పాటు సచివాలయ కార్యదర్శిగా పనిచేశారు. 2014 జూన్‌ 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సచివాలయ కార్యదర్శిగా పనిచేశారు. మొత్తం 41 ఏండ్ల పాటు అసెంబ్లీలోని వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. రాష్ట్రపతి, రాజ్యసభ, మండలి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వర్తించారు.రాజ్యంగం, న్యాయశాస్త్ర నిబంధనలపై సదారాంకు లోతైన అవగాహన ఉంది.

ఆర్టీఐ కమిషనర్‌గా నియమితులైన సీనియర్ జర్నలిస్టు బుద్దా మురళి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా.. తుర్కపల్లి. ఈయన 30 ఏళ్ల నుంచి ఆంధ్రభూమి దిన పత్రికలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం చీఫ్ రిపోర్టర్ హోదాలో పని చేస్తున్నారు. మెదక్, నల్లగొండ, వరంగల్, మహబూబ్ నగర్,  హైదరాబాద్‌లలో పని చేశారు. రాజకీయ పరిణామాలపై కొన్ని వందల వ్యాసాలు రాశారు బుద్ధా మురళి. ఆంధ్రభూమి డైలీలో జనాంతికం పేరుతో రాజకీయ వ్యంగ్య కాలం 16 ఏళ్ల నుంచి నిరాటంకంగా వస్తోంది. మాసపత్రికలో వర్తమానం శీర్షికతో నాలుగేళ్ళ నుంచి కాలం రాస్తున్నారు. మూడు దశాబ్దాల నుంచి సామాజిక మార్పులు.. రాజకీయ పరిణామాలపై పలు వ్యాసాలు రాశారు. ఓటమే గురువు అనే పుస్తకాన్ని కూడా బుద్దా మురళీ రచించారు.

కమిటీ సమావేశానికి తొలిసారి ప్రగతి భవన్‌కు వచ్చిన ప్రతిపక్ష నేత జానారెడ్డికి డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రి హరీష్ రావు ఘన స్వాగతం పలికారు.