సత్తా చాటిన హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు

హైదరాబాద్ హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు నాలుగు బంగారు పతకాలు సాధించారు. ఈ నెల 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామన్వెల్త్ అన్ని విభాగాల (యూత్ /జూనియర్/సీనియర్) వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో సత్తా చాటారు. పతకాలు సాధించిన ఇ.దీక్షిత, ఆర్.వి.వరుణ్, ఆర్.వి.రాహుల్ ను క్రీడల శాఖ మంత్రి పద్మారావు అభినందించారు. 2018 లో జరిగే కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ కు అర్హత సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కామన్వెల్త్ తో పాటు భవిష్యత్తు టోర్నీలకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి పద్మారావు భరోసా ఇచ్చారు. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్ధులు ఈ స్థాయిలో రాణించడం చాలా సంతోషంగా వుందని, ఇది తెలంగాణకు గర్వకారణమని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో క్రీడల శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎండి దినకర్ బాబు, మంత్రి ఓ‌ఎస్‌డి రాజేశ్వర్ రావు, స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్‌డి నర్సయ్య, విమలాకర్ తదితరులు పాల్గొన్నారు.