శ్రీశైలం ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద  

జూరాల నుంచి శ్రీశైలం జలాశాయనికి వరద కొనసాగుతుంది. సోమవారం నాటికి జూరాల ప్రాజెక్టు నుంచి 32వేల క్యూసెక్కుల ఇనోఫ్లో కొనసాగుతున్నదని డ్యాం అధికారులు తెలిపారు.శ్రీశైలం పూర్తిస్థాయి 885 అడుగులకు సోమవారం సాయంత్రం 6 గంటలకు 798.20 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటినిల్వ పూర్తిస్థాయి సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 28.1303 టీఎంసీలుగా నమోదైంది. సోమవారం రాత్రి వరకు శ్రీశైలం జలాశయం నీటిమట్టం 20 అడుగుల మేర పెరిగింది.

అటు జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. 60 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి వరకు ప్రాజెక్టులోకి వరద స్థిరంగా వస్తుండటంతో ఐదు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ పవర్ హౌస్ నుంచి 32 వేల క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు. అదీగాక జూరాల నుంచి ఎత్తిపోతల పథకాలు, కాల్వలకు 6,505 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తంగా 38,505 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదవుతున్నది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 7.971 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఎగువ నుంచి ఆల్మట్టిలోకి వరద వస్తుండగా, సోమవారం రాత్రివరకు 19,023 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. నారాయణపూర్ ప్రాజెక్టులోకి 17,483 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 17,330 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. పవర్‌హౌస్ ద్వారా 6000, స్పిల్‌వే గేట్ల నుంచి 11,330 క్యూసెక్కులతో మొత్తం 17,330 క్యూసెక్కులు దిగువకు వదిలారు.

ఇక గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి లక్ష్మి, కాకతీయ కాలువలకు నీటి విడుదల కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 330 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గిపోవడంతో రిజర్వాయర్‌లో నీటిమట్టం నిలకడగా ఉంది. 3,250 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో నమోదవుతున్నది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 29.294 టీఎంసీల వరద వచ్చి చేరినట్లు అధికారులు వెల్లడించారు. వరద కాలువకు 3 వేలు, లక్ష్మి కాలువకు 200, కాకతీయ కాలువకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 1073.70 అడుగుల మేర నీటి నిల్వ ఉంది.

అటు కడెం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి స్వల్ప ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం7.603టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.271టీఎంసీల వద్ద ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 831 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. కుడి కాలువ ద్వారా 19 క్యూసెక్కులు, ప్రధాన కాలువ ద్వారా 812 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 780 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టులో 3.096 టీఎంసీల నీటి నిల్వ ఉంది.