శరవేగంగా మంచిప్ప నిర్మాణ పనులు

టీఆర్‌ఎస్‌ సర్కారు వ్యవసాయాన్ని పండగలా మారుస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ బీడుభూములను సస్యశ్యామలం చేస్తోంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మంచిప్ప పెద్ద చెరువు, కొండెం చెరువును కలుపుతూ 3.5 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నిర్మాణం చేపట్టేందుకు నడుం బిగించింది. 400 కోట్ల రూపాయలతో రిజర్వాయర్ నిర్మాణం   చేపట్టనుంది. రిజర్వాయర్ నిర్మాణంతో 700 ఎకరాల అటవీ భూమి, సుమారు 1000 ఎకరాల వరకు రైతుల భూములు ముంపునకు గురవనున్నాయి. కాగా రైతులంతా తమ భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. భూ నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకోవడానికి  ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిజామాబాద్ ఇన్ చార్జి కలెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. ఆశించిన దాని కంటే ఎక్కువగానే పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

రిజర్వాయర్ పూర్తైతే 80 వేల ఎకరాల భూమి సాగులోకి రానుంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్, నిజామాబాద్ రూరల్, డిచ్‌పల్లి, ఇందల్‌వాయి, ధర్పల్లి, జక్రాన్‌పల్లి, సిరికొండ, బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ తదితర మండలాల్లోని భూములు సస్యశ్యామలం అవనున్నాయి. రెండు పంటలు పుష్కలంగా పండనున్నాయి. ఇందుకు గాను వానాకాలం పంట పూర్తయ్యే నాటికల్లా రిజర్వాయర్‌లో 3.5 టీఎంసీల గోదావరి నీటిని లిఫ్ట్ ద్వారా నిల్వ చేసి ఉంచుతారు. వానాకాలం పంట సాగుకోసం గోదావరి నీటిని లిఫ్ట్ ద్వారా అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన 20,21 ప్యాకేజీల పనులు చురుకుగా సాగుతున్నాయి.నవీపేట మండలంలోని బినోల గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న గోదావరి నీటిని నిజామాబాద్ రూరల్ మండలంలోని సారంగాపూర్ గ్రామం వరకు తరలించేందుకు టన్నెల్ పంప్ హౌస్ లు నిర్మిస్తోంది. ఈ నిర్మాణాలను  20వ ప్యాకేజీ కింద చేపట్టేందుకు ప్రభుత్వం 892 కోట్లు మంజూరు చేసింది. 21 వ ప్యాకేజీ కింద 1143 కోట్ల 70లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో టన్నెల్ పనులు జోరుగా జరుగుతున్నాయి. మరోవైపు కొండెం చెరువు పక్కన పంప్‌హౌస్ నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి.  ఈ పనులన్నీ పూర్తయితే అండర్ గ్రౌండ్ పైప్‌లైన్ సహాయంతో మోపాల్, నిజామాబాద్ రూరల్, డిచ్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ, ఇందల్‌వాయి, జక్రాన్‌పల్లి, భీమ్‌గల్, కమ్మర్‌పల్లి, మోర్తాడ్, వేల్పూర్, ఆర్మూర్, మాక్లూర్, జగిత్యాల జిల్లా  మెట్‌పల్లి మండలాల్లోని 150 గ్రామాల రైతులకు చెందిన రెండు లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందనుంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాల్వల ద్వారా కాకుండా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ సహాయంతో సాగునీటి సరఫరా విజయవంతంగా అమలవుతోంది. దీంతో రైతులు భూమిని కోల్పోకుండానే సాగు నీళ్లు పొందడంతో పాటు వృథాను అరికట్టే అవకాశం ఉంది. నిజామాబాద్‌లోని ఈ ప్రాజెక్టును కూడా ఇదే తరహాలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైలెట్‌ ప్రాజెక్టుగా మంచిప్ప ప్రాజెక్టును చేపట్టింది.