వినాయక నిమజ్జనానికి జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు

గణేష్‌ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించడానికి జీహెచ్‌ఎంసీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా  గ్రేటర్‌ పరిధిలో కొలువైన ఉన్న గణేష్‌ ఉత్సవ కమిటీలతో జీహెచ్‌ఎంసీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. గణేష్‌ ఉత్సవ కమిటీలు లేవనెత్తిన అంశాలపై శాఖలవారీగా చర్యలు చేపట్టాలని మేయర్‌, కమిషనర్‌ అధికారులను ఆదేశించారు. శోభాయాత్ర జరిగే మార్గంలో రోడ్ల మరమ్మతులు, అదనపు విద్యుత్‌ దీపాల ఏర్పాటు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

సెప్టెంబర్ 5న వినాయక నిమజ్జన శోభాయాత్ర దాదాపు 354 కిలోమీటర్ల మేర సాగనుంది. దీనికోసం బల్దియా పరిధిలో 168 గణేష్ నిమజ్జన యాక్షన్ టీంలు, 10 వేల మంది శానిటేషన్ కార్మికులు, 295మంది జవాన్లు, 688 మంది ఎస్‌ఎఫ్‌ఏలు పనిచేయనున్నరు. ఈ టీంలు ఒక్కో ఘాట్ వద్ద 21 మంది పారిశుద్ధ్య కార్మికులు, ఒక సూపర్ వైజర్, ఒక జవాన్, ముగ్గురు ఎస్‌ఎఫ్‌ఏలు మూడు షిఫ్టుల్లో పనిచేస్తారు. వీరితో పాటు దోమల నివారణ కోసం 1000 మంది ఎంటమాలజీ సిబ్బంది..  చెరువులున్న ప్రాంతాల్లో విధులు నిర్వహించనున్నారు. ఎల్బీనగర్‌ నుంచి హుస్సేన్‌ సాగర్‌ మార్గంలో జరుగుతున్న మెట్రో పనులతో చాలా చోట్ల రోడ్లు పాడైపోయాయని.. ఉత్సవ కమిటీ సభ్యులు కమిషనర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా బాలా పూర్ నుంచి వచ్చే శోభాయాత్రకు చాంద్రాయణగుట్ట ,ఫలక్ నుమ, లాల్ దర్వాజ, చార్మినార్, అఫ్జల్ గంజ్ మార్గాల్లో రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా ఉందన్నారు. దీనివల్ల శోభాయాత్ర  ఆలస్యం అవుతుందన్నారు. అయితే రోడ్ల మరమ్మతులకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ జనార్ధన్ రెడ్డి చెప్పారు.

అటు వినాయక నిమజ్జనానికి మొదలు పెట్టిన బేబీ పాండ్స్ కొన్ని పూర్తయ్యాయి. పూర్తైన వాటిలో సాధ్యమైనంత మేర నీటిని నింపాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలిచ్చారు మేయర్ బొంతు రామ్మోహన్. ఇక వినాయక నిమజ్జనం తేదీ పై వస్తున్న గందగోళంపై మేయర్ క్లారిటీ ఇచ్చారు.  అనంత చతుర్ధశి రోజున వినాయక నిమజ్జనం జరుపుకోవడం అనవాయితీ అన్నారు.  బాలాపూర్ , ఖైరతాబాద్ విగ్రహాలను సెప్టెంబర్ ఐదున ఉదయం పదకొండు గంటలకే ఊరేగింపుగా బయల్దేరేలా చర్యలు తీసుకోవాలని ఉత్సవ కమిటి సభ్యులను మేయర్ కోరారు. అటు హుస్సేన్‌ సాగ‌ర్ వ‌ద్ద నిమ‌జ్జ‌నం సాఫీగా జ‌ర‌గ‌డానికి జీహెచ్ఎంసీ 38 భారీ క్రేన్లు అందుబాటులో ఉంచనుంది. మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.