విద్యార్థి హత్య కేసులో కండక్టర్ అరెస్ట్

హర్యానాలోని గుర్గావ్ ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడు హత్యకు గురైన కేసులో పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. స్కూల్‌ కు చెందిన బస్సు కండక్టరే ఈ హత్య  చేసినట్లు పోలీసులు తేల్చారు. అతన్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్ట్ అతన్ని మూడు రోజులు పోలీస్ రిమాండ్ కు ఇచ్చింది. ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు.

ఏడేళ్ల విద్యార్థిని కండక్టర్ లైంగికంగా వేధించడంతో అతను అలారం మోగించాడని, విషయం బయటపడుతుందన్న భయంతో బాలుడిని కండక్టర్‌ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా ఇప్పటివరకు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. గార్డెనర్, డ్రైవర్స్, కండక్టర్స్, స్కూల్ స్టాఫ్ మెంబర్స్ ను పోలీసులు విచారించారు. ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేశారు.

ఐతే, బాలుని తల్లితండ్రులు మాత్రం ఈ హత్యతో స్కూల్‌ యాజమాన్యానికి సంబంధం ఉందని చెబుతున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన కండక్టర్‌ ను తమ కుమారుడు చూడలేదని… స్కూల్ బస్‌ కూడా ఎప్పుడు ఎక్కలేదని అన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ ని జైలుకు పంపాలని, సీబీఐ విచారణ జరపాలని కోరారు.