వరంగల్ పట్టణానికి మరో ఘనత

కాకతీయుల కళావైభవానికి చిరునామాగా నిలిచిన ఓరుగల్లు జాతీయస్థాయిలో మెరిసింది. రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరంగా.. ఉత్తర, దక్షిణ భారతానికి వారధిగా నిలిచిన వరంగల్‌ కీర్తి మరోసారి రెపరెపలాడింది. ఎడ్యుకేషనల్‌ హబ్‌గా, టెక్స్‌ టైల్‌ కారిడార్‌తో దినదిన ప్రవర్థమానం చెందుతున్న ఏకశిలా నగరాన్ని జాతీయ వారసత్వ అవార్డు వరించింది. ఇప్పటికే 2013లో యునెస్కో వారసత్వ నగరంగా గుర్తింపు పొందిన వరంగల్‌ కు తాజాగా కేంద్ర ప్రభుత్వం జాతీయ వారసత్వ నగరం అవార్డును ప్రకటించింది. హృదయ్‌, అమృత్‌, స్మార్ట్‌ సిటీ జాబితాల్లో చోటుదక్కించుకొన్న చారిత్రాత్మక నగరి సిగలో ఇప్పుడు మరో అవార్డు చేరింది. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఉమ్మడిగా వారసత్వ నిర్మాణాలు నిర్వహణ, భవిష్యత్‌ తరాలకు వారధిలా ఉండేందుకు చేపడుతున్న కార్యక్రమాలపై ముచ్చటపడ్డ కేంద్ర పర్యవరణశాఖ 2017 ఏడాదికి వరంగల్ వారసత్వ నగరంగా ఎంపికచేసింది.

 హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ను అన్నిరంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ప్రత్యేకించి పర్యాటక రంగ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్ర పర్యాటకశాఖ అధ్వర్యంలో కైట్‌  ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించింది. ఇక్కడి చరిత్ర , సంస్కృతి భవిష్యత్‌ తరాలకు అందించేందుకు మూడేండ్లుగా కృషి చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వరంగల్‌ ఇప్పటికే హృదయ్‌, అమృత్‌, స్మార్ట్‌ సిటీల జాబితాలో చోటు దక్కించుకున్నది. ఈ పథకాలకు కేంద్రం నుంచి వచ్చే నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను విడుదల చేసి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నది. రాష్ట్రంలో ఏ నగరానికి లేని విధంగా బడ్జెట్‌లో 300 కోట్లు కేటాయించింది. ఉత్తర, దక్షిణ భారతావనికి వారధిగా ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్‌, కాకతీయ శిల్పకళా వైభవానికి నిలువెత్తు ప్రతీకలైన వేయిస్తంబాల గుడి, ఖిలా వరంగల్‌, పద్మాక్షి గుట్ట భద్రకాళి ఆలయం, కాజీపేట దర్గా, వడ్డెపల్లి చెరువును అభివృద్ధి చేస్తున్నది.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుతో పద్మాక్షి గుట్ట వరుసల్లోని జైన్‌గుట్టకూ హృదయ్‌లో కేంద్రం చోటు కల్పించింది. వరంగల్‌ కేవలం చారిత్రక ఔనత్యానికి చిరునామాగా మాత్రమే కాకుండా మెడికల్‌, ఇంజినీరింగ్‌ విద్యాసంస్థలతో  ఎడ్యుకేషన్‌ హబ్‌గా పేరుపొందింది. మొదటి నుంచి వరంగల్‌కు ఉన్న సాంస్కృతిక రాజధాని స్థానాన్ని సుస్థిరం చేసేందుకు పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక చొరవ ప్రదర్శిస్తున్నది. వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ అమ్రపాలి, గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ శృతి ఓఝా పట్టణాభివృద్ధిపై దృష్టి పెట్టారు. జీడబ్ల్యూఎంసీ, కూడా పర్యాటకశాఖ ఉమ్మడిగా పురావస్తు క్షేత్రాల నిర్వహణతో పాటు కొత్త ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాయి.