వచ్చే 9 నెలలు కీలకం

మిషన్ భగీరథ పూర్తయితే ఇంటింటికి నీళ్లు అందించే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇంటింటికి నీళ్లు-ఇంటింటికి ఇంటర్నెట్ అనే కార్యక్రమం ద్వారా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని ఆర్.డబ్ల్యు.ఎస్ అండ్ ఎస్ కార్యాలయంలో మిషన్ భగీరథ వెబ్ సైట్, మొబైల్ యాప్ లను ఆయన ఆవిష్కరించారు. ఆఫీసులో కొత్తగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్ ను ప్రారంభించారు. ఆ తర్వాత మిషన్ భగీరథ పనుల పురోగతిని సమీక్షించి, అందరితో ప్రతిజ్ఞ చేయించారు.

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు ఒక ప్రధానమైన అంశమని మంత్రి కేటీఆర్ చెప్పారు. తొలి నాళ్ళలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆలోచనే మిషన్ భగీరథ కార్యక్రమం అన్నారు. ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికలలో ఓట్లు అడగను అన్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఈ భగీరథ ప్రయత్నం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతోందని చెప్పారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మిషన్ భగీరథ పనులను స్వయంగా చూసి మెచ్చుకోవడం ప్రతి ఒక్కరికి తెలుసన్నారు.

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు నేరుగా నీటిని అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మిషన్ భగీరథ పెద్ద ఛాలెంజ్ కాబట్టి అధికారులందరు  సమగ్ర కృషి చేస్తూ పనులను త్వరగా ముగించాలని కోరారు. వచ్చే తొమ్మిది నెలలు ఇందులో కీలకమన్నారు. తొందరలోనే ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించే దిశగా ముందుకు వెళ్ళాలని, వందకు వంద శాతం ఒక మంచి ప్రాజెక్టు పూర్తి చేశామని సంతృప్తి అటు ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులకు, ఇటు ప్రభుత్వానికి ఉంటుందన్నారు.

80 శాతం జబ్బులు కలుషిత నీటి వాడకం వల్లనే వస్తాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇంటింటికి రక్షిత మంచినీరు ఇవ్వడం వల్ల వాటిని నిరోధించవచ్చన్నారు. మనం చేస్తున్న ప్రయత్నం ఒక్క మంచినీళ్ళు అందించే దిశగానే కాకుండా ప్రపంచంలోనే ఆదర్శంగా తీసుకునేలా తయారు చేయాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దీనిని ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని చెప్పారు. కోటి కుటుంబాలకు నీళ్లు అందించే దిశగా ముందుకు వెళ్ళాలని అన్నారు.

ఇప్పటికే 9 రాష్ట్రాల అధికారులు  మిషన్ భగీరథ పనులను చూసి మెచ్చుకున్నారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అన్ని రాష్ట్రాల అధికారులు మెచ్చుకుంటారనే నమ్మకం తనకు ఉందన్నారు. ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులు బాగా కష్టపడుతున్నారని ప్రశంసించారు. గమ్యం చేరే వరకు బాగా పని చేయాలని సూచించారు.

మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, మున్సిపల్, ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.