పాడి రైతుల సంక్షేమానికి కృషి

రాష్ట్రంలోని పాడి రైతులకు సీఎం కేసీఆర్‌ వరాలు ప్రకటించారు. విజయా డెయిరీకి ఇస్తున్నట్టుగా లీటరు పాలకు 4 రూపాయల ఇన్సెంటివ్‌ అందిస్తామని ప్రకటించారు. అలాగే పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై బర్రెలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ ప్రగతిభవన్‌ లో… పాడి రైతులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కష్టపడి సాధించుకున్న తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్‌. 60 ఏళ్ల సమైక్య పాలనలో ఏ ఒక్కటీ సరిగా జరగలేదని మండిపడ్డారు. అన్ని వర్గాలు నిరాదరణకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితుల్లో మార్పువస్తోందన్నారు. గొర్రెలు, చేపల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. గోదావరి నీళ్లతో తెలంగాణ రైతుల కాళ్లు కడుగుతామన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పారు.

రాష్ట్రానికి అవసరమైన పాలు ఇక్కడే ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు సీఎం కేసీఆర్‌. క్షీర విప్లవం దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశామని తెలిపారు. వాటి ద్వారా రైతులకు మద్దతు ధర లభిస్తుందని సీఎం కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

విజయా డెయిరీకి ఇస్తున్నట్టుగానే నల్లగొండ, రంగారెడ్డి, ముల్కనూర్‌, కరీంనగర్‌ సొసైటీలకు… లీటరు పాలకు 4 రూపాయల ఇన్సెంటివ్‌ ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ నెల 24 నుంచి ఇది అమలవుతుందని హామీ ఇచ్చారు. సొసైటీల్లో ఉన్న 2 లక్షల మంది సభ్యులు ప్రతీ ఒక్కరూ ఇంటికి ఆరు మొక్కలు పెంచాలని సీఎం కేసీఆర్‌ కోరారు. అలాగే వారికి 50 శాతం సబ్సిడీ కింద బర్రెలు ఇప్పిస్తామని చెప్పారు. దళితులు, గిరిజన పాడిరైతులుంటే వారికి 75 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు సీఎం కేసీఆర్‌.

అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళుతున్నామని చెప్పారు.