లష్కరే తోయిబాకు చావుదెబ్బ

జమ్మూకాశ్మీర్ లో లష్కరే తోయిబాని చావుదెబ్బ కొట్టారు పోలీసులు, భద్రతా బలగాలు.  నౌగాంలో జరిగిన ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిబా కమాండర్ అబూ ఇస్మాయిల్ సహా మరో టెర్రరిస్టుని హతమార్చారు. వారి నుంచి రెండు ఏకే 47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల కిందట అమరనాథ్ యాత్రికులపై జరిగిన దాడితో పాటు పలు దాడుల్లో అబూ కీలక నిందితుడని జమ్మూకాశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ వెల్లడించారు. అమరనాథ్ దాడి తర్వాత అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నామని చెప్పారు.

అబూ ఇస్మాయిల్ తమ ప్రధాన టార్గెట్ అని జమ్మూకాశ్మీర్ ఐజీపీ మునీర్ ఖాన్ చెప్పారు. అతన్ని హతమార్చిన తమ బృందానికి అభినందనలు తెలిపారు. ఆపరేషన్ పూర్తి చేయడానికి అరగంట సమయం పట్టిందన్నారు. మిలిటెంట్ నాయకులు తమ పిల్లలను  తప్పుదారి పట్టిస్తున్నారని, అందుకే వారిని నిర్మూలించాల్సి ఉందన్నారు. ఇది తమకు అతిపెద్ద విజయమని సీఆర్పీఎఫ్ డీజీ రాజీవ్ రాయ్ భట్నాగర్ పేర్కొన్నారు. లష్కరే తోయిబా ప్రధాన నాయకత్వాన్ని నిర్మూలించడమే తమ ప్రధాన లక్ష్యమని, ఆ మేరకు ఈ ఆపరేషన్ అత్యంత ప్రధానమైనదని విక్టర్ ఫోర్స్ జీవోసీ బీఎస్ రాజు వ్యాఖ్యానించారు.

ఇస్మాయిల్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో శ్రీనగర్ లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఆ తర్వాత టూజీ, త్రీజీ సేవలను పునరుద్ధరించినా.. ఫోర్ జీ సేవలను నిలిపి ఉంచారు.