లండన్‌లో మరో ఉగ్రదాడి

బ్రిటన్ రాజధాని నగరం లండన్ మరోసారి ఉగ్రదాడితో కంపించింది. లండన్ లోని భూ గర్భ మెట్రోరైల్వేలో శక్తిమంతమైన బాంబు పేలింది. ఈ ఘటనలో కనీసం 22 మంది గాయపడ్డారు. ఇది ఉగ్రవాద చర్యేనని స్కాట్లాండ్‌యార్డు (బ్రిటన్ పోలీసు విభాగం) ధ్రువీకరించింది. ఉదయంపూట రద్దీ సమయంలో పార్సన్స్ గ్రీన్స్ స్టేషన్‌లోకి జిల్లాలకు వెళ్లే ట్యూబ్‌ట్రైన్ వస్తున్నప్పుడు అందులో అమర్చిన బకెట్‌బాంబు పెద్దశబ్దంతో పేలింది. అధునాతన పేలుడు పదార్థంతో ఆ బకెట్‌బాంబును తయారు చేశారని స్కాట్లాండ్‌యార్డు తెలిపింది. గాయపడిన 18 మందిని దవాఖానకు తరలించినట్టు లండన్ అంబులెన్స్ సర్వీసు వెల్లడించింది. మరో నలుగురు సొంతంగా దవాఖానకు వచ్చారని తెలిపింది.  దర్యాప్తును రవాణా పోలీసు విభాగం నుంచి స్కాట్లండ్‌యార్డు ఉగ్రవాద నిరోధక దళానికి బదలాయించారు. బాంబుదాడి ఉగ్రవాద చర్యేనని ఉగ్రవాద నిరోధక దళం సీనియర్ అధికారి నీల్ బసు ధ్రువీకరించారని మహానగర పోలీసు విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. పోలీసులు రైల్వేస్టేషన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అటువైపు ఎవరూ వెళ్లరాదని ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. ఉగ్రవాద ఘటనపై ప్రధాని థెరెసా మే దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడినవారికి సానుభూతి తెలిపారు. చురుకుగా సహాయకార్యక్రమాల్లో పాల్గొంటున్న సిబ్బందిని ప్రశంసించారు. పరిస్థితిపై థెరెసా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని ఆమె కార్యాలయం తెలిపింది. ఇలాంటి దాడులకు లండన్ ప్రజలు వెరువరని మేయర్ సాదిక్‌ఖాన్ అన్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.