లంకతో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్

శ్రీలంక గడ్డపై భారత్ చరిత్ర సృష్టించింది. శ్రీలంక వన్డే సిరీస్‌ ను క్లీన్‌ స్వీప్ చేసింది. వరుస విజయాల జోరును కొనసాగిస్తూ చివరి వన్డేలోనూ లంకను చిత్తుగా ఓడించింది. 3-0తో చారిత్రాత్మక టెస్టు సిరీస్‌ ను గెల్చుకున్న భారత్.. వన్డే సిరీస్‌ నూ 5-0 తో క్లీన్‌స్వీప్‌ చేసింది. శ్రీలంకపై ఐదు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం ఇది రెండోసారి. గతంలో 2014లోనూ భారత్ శ్రీలంకపై 5-0 తేడాతో గెలిచింది. ఐదో మ్యాచ్‌ లో మొదట భువనేశ్వర్ ఐదు వికెట్లతో లంక భరతం పట్టగా.. తర్వాత కోహ్లీ అజేయ సెంచరీతో లంకపై విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఆరు వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం విజయం సాధించింది. ఏ దశలోనూ భారత్ కు పోటీనివ్వలేకపోయిన లంక.. మరో దారుణ ఓటమిని మూటగట్టుకుంది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక.. భువనేశ్వర్ ధాటికి 49.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. పరాజయాల పరంపరను కొనసాగిస్తూ.. ఆఖరి మ్యాచ్ లో కూడా ప్రత్యర్థి భారత్ ముందు భారీ స్కోర్ నిర్ధేశించడంలో లంక బ్యాట్స్ మెన్స్ విఫలమయ్యారు. టాప్ ఆర్డర్ తో సహా అందరూ బ్యాట్స్ మెన్స్ చేతులెత్తయడంతో  ఏ దశలోనూ శ్రీలంక భారీ స్కోర్ దిశగా సాగలేదు. లాహిరు తిరిమానె, మాథ్యూస్ అర్ధ సెంచరీలు సాధించడంతో లంక ఆ మాత్రం స్కోర్ నైనా సాధించగలిగింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ 5, బుమ్రా 2, కుల్దీప్ యాదవ్, చాహల్ ఒక్కో వికెట్ తీశారు.

239 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్స్ రహానే 17 పరుగుల వద్ద, రోహిత్‌ శర్మ 29 పరుగుల వద్ద పెవిలియన్‌ చేరారు. ఈ స్ధితిలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ అజేయ సెంచరీతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. మనీష్‌ పాండే తో కలిసి మూడో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టు స్కోరు 128 పరుగుల వద్ద పాండే అవుటైనా.. కోహ్లీ జోరుమాత్రం తగ్గలేదు. కేదార్ జాదవ్ తో కలిసి లంక బౌలర్లకు చుక్కులు చూపించాడు. కెప్టెన్ కు తోడుగా కేదార్ జాదవ్ అర్ధ సెంచరీతో రాణించాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌ కు 109 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియా గెలుపు ఖరారు చేసుకుంది. చివరలో జాదవ్ అవుటైనా.. ధోనితో కలిసి కోహ్లీ లాంఛనాన్ని పూర్తిచేశాడు. లంక బౌలర్లలో మలింగ, ఫెర్నాండో, పుష్పకుమార, డిసిల్వా తలో వికెట్ తీశారు.

5వికెట్లతో శ్రీలంక నడ్డివిరిచిన భారత్ బౌలర్ భువనేశ్వర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. ఐదు మ్యాచ్ ల్లో 15 వికెట్లు పడగొట్టిన జస్‌ప్రీత్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది సీరిస్ లభించింది. కాగా ఇరు జట్ల మధ్య ఏకైక టీ-ట్వంటీ మ్యాచ్ ఈ నెల 6న కొలంబోలో జరుగనుంది.