లంకతో వన్డే సిరీస్‌ అంతా ధోనీమయమే!

ఎంతటివారైనా… ఆడితేనే జట్టులో ఉంటారు. ధోనీకి ఇది మినహాయింపు కాదు, ప్రత్యామ్నాయాలు సిద్ధంగా ఉన్నాయి… ఇవి శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు భారత చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే.. ధోనీ గురించి చేసిన చీప్‌ కామెంట్స్. దశాబ్ద కాలంగా భారత క్రికెట్‌ను అనితర సాధ్యమైన విజయాలతో సమ్మోహన పర్చిన ఓ అద్భుత సారథి గురించి ఇంత పరుషంగా మాట్లాడటం అభిమానులకు బాధ కల్గించింది. భారత క్రికెట్‌లో దుర్భిణి వేసి వెతికినా గతంలో ప్రస్తుతం ధోనీ లాంటి వికెట్ కీపర్ కనిపించడు. అలాంటి దిగ్గజ వికెట్ కీపర్‌ గురించి… ఓ అతి సాధారణ వికెట్ కీపర్‌గా ఒకటి అరా మ్యాచ్‌లు ఆడిన ఎమ్మెస్కే వ్యాఖ్యానించడం కాల మహిమ. ముమ్మాటికీ కాలమహిమే. కానీ ప్రతికూల కాలాన్ని సైతం ఎదుర్కొనే సత్తా కొందరికే ఉంటుంది. మిస్టర్‌ కూల్‌గా పేరుగాంచిన మహీ కూడా ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో మరోసారి తన తడాఖా చూపించాడు. భారత వన్డే జట్టులో తన స్థానం ఎంత ముఖ్యమో చాటి చెప్పాడు.

కెప్టెన్‌గా ధోనీ ఓ బ్రాండ్. దశాబ్ద కాలంగా తిరుగులేని సారథ్యంతో అలరించిన ధోనీ… తప్పనిసరి పరిస్థితుల్లో సారథ్యం వదులుకున్నాడు. 2019 వరల్డ్‌ కప్‌ సన్నాహకం అంటూ బోర్డులో కొంత మంది అత్యుత్సాహం ప్రదర్శించారు. బ్యాటింగ్‌లో చెలరేగుతున్న కోహ్లికి సారథ్యం అప్పజెప్పాలన్న ఆలోచనతో ధోనీపై ఒత్తిడి పెంచారు. పరిస్థితి అర్థం చేసుకున్న ధోనీ మిస్టర్‌ కూల్‌గా కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. విరాట్‌కు పగ్గాలు అప్పగించిన తర్వాత ధోనీ ఆటపై సందేహాలు మొదలయ్యాయి. మునుపటిలా ఆడటం లేదు, స్ట్రయిక్ రొటేట్ చేయలేకపోతున్నాడు, ఫినిషింగ్ సత్తా తగ్గింది, భారీ షాట్లు బాదడం లేదు, కీపింగ్‌లో మెరుగుదల లేదు.. ఇలా విమర్శకులు ఎడాపెడా మాట్లాడేశారు. కానీ ఇప్పుడు 36 ఏండ్ల వయసులో ధోనీ.. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. నిలకడైన బ్యాటింగ్‌తో భారత్‌కు అద్భుతమైన విజయాలు అందించాడు. కేవలం నాలుగు మ్యాచుల్లోనే తానేంటో, తన విలువేంటో మరోసారి చాటుకున్నాడు.

శ్రీలంకతో వన్డే సిరీస్‌లో భారత్ ఆరు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేస్తే మూడింటిలో ధోనీ కీలక పాత్ర పోషించాడు. టీమ్‌ఇండియా మిడిలార్డర్‌కు మహీ వెన్నెముక అని తేలిపోయింది. రెండో వన్డేలో ధనంజయ స్పిన్ ధాటికి 137 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్‌ను… ధోనీ ఆపద్బాంధవుడిలా ఆదుకున్నాడు. నిశ్శబ్దంగా తన పని తాను చేస్తూనే.. భువనేశ్వర్‌తో ఓ అసాధ్యమైన ఇన్నింగ్స్ ఆడించాడు. మూడో వన్డేలో 64 పరుగులకే 4 వికెట్లు పడ్డప్పుడు కూడా మహీ మరోసారి జట్టును ఆదుకున్నాడు. నాలుగో వన్డేలో రోహిత్, విరాట్ సెంచరీలు చేసినా…. స్లాగ్ ఓవర్లలో మనీష్ తో కలిసి తన దూకుడు తగ్గలేదని నిరూపించాడు.

బ్యాటింగ్‌ విషయాన్ని పక్కనపెడితే  ఈ సిరీస్‌లో ధోనీ ఎన్నో విషయాల్లో తన ప్రత్యేకత చాటుకున్నాడు. అసలు ధోనీ జట్టులో కెప్టెన్‌ కాకున్నా అభిమానుల కళ్లకు కెప్టెన్‌లానే కనిపిస్తున్నాడు. కోహ్లికి విలువైన సూచనలు ఇవ్వడంలో… మ్యాచ్‌ కీలక సమయాల్లో అతని పదునైన ఆలోచనలతో ధోనీ మార్క్ చూపించాడు. నాలుగో వన్డేలో డీఆర్‌ఎస్‌ విషయంలో ధోనీ దిమాక్ ఎంటో మరోసారి తెలిసిపోయింది. శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో ధోనీ అప్పీల్ చేసిన తీరుపై అభిమానులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టార్గెట్ ఛేజింగ్‌కు దిగిన లంక ఓపెనర్ డిక్విల్లా వికెట్‌ నాటకీయంగా కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన బంతి బ్యాట్స్‌మెన్‌కి కాస్త దూరంగా బౌన్స్ అవుతూ వెళ్లి ధోనీ చేతిలో పడింది. అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. కానీ ధోనీ మాత్రం ఔట్‌కి అప్పీల్ చేశాడు. ధోనీపై నమ్మకంతో ఉన్న కెప్టెన్ కోహ్లి డీఆర్‌ఎస్‌ కోరాడు. రివ్యూలో డిక్‌వెలా ఔట్ అయినట్టు తేలింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. అభిమానులు ‘డీఆర్‌ఎస్‌ అంటే ధోనీ రివ్యూ సిస్టమ్‌’, డీఆర్‌ఎస్‌లో నువ్వు బాస్‌ అని ట్విట్టర్‌లో పొగుడుతున్నారు.

ఇక ఇదే సిరీస్‌లో ధోనీ 300వ వన్డేలు ఆడిన ఆరో భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. కానీ అదే వన్డేలో గణాంకాలు, వ్యక్తిగత రికార్డులతో తనకు పని లేదని చేతల్లో చూపించాడు. మనీష్ పాండే హాఫ్ సెంచరీ కోసం తాను త్యాగం చేసి ధోనీ అంటే జట్టు మనిషినని నిరూపించుకున్నాడు. నాలుగో వన్డేలో స్లాగ్ ఓవర్లలో ధాటిగా ఆడిన ధోనీ, పాండే చివరి రెండు బంతులకు ముందు ఇద్దరూ 48 పరుగుల వద్ద ఉన్నారు. అప్పుడు క్రీజ్‌లో ఉన్న ధోనీ ఒక్క భారీ షాట్ ఆడితే హాఫ్ సెంచరీ సాధించడం ఖాయం. అందునా 300వ వన్డేలో హఫ్ సెంచరీ సాధించాలని ఏ క్రికెటర్‌ అయినా అనుకుంటాడు. కానీ ధోనీ మాత్రం అవతల క్రీజ్‌లో ఉన్న యువ క్రికెటర్ పాండే గురించి ఆలోచించాడు. ఐదో బంతికి సింగిల్‌ తీసి పాండేకు అవకాశమిచ్చాడు..! అందుకే ఈ మ్యాచ్‌లో పాండే హాఫ్ సెంచరీ సాధించగా… ధోనీ 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

మొత్తంగా శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ధోనీ అభిమానులు ఎమ్మెస్‌ సిరీస్‌గా పిలుచుకుంటున్నారు. ఎమ్మెస్కే చేసిన విమర్శలకు… ఎమ్మెస్‌డీ దిమ్మదిరిగేలా సమాధానమిచ్చిన సిరీస్‌ అన్న మాట.