రోహింగ్యాల ర‌క్షణకు ఒత్తిడి పెంచండి

రోహింగ్యాలపై కొన‌సాగుతున్న హింసాకాండ‌ను నిలువ‌రించేలా బంగ్లాదేశ్, మ‌య‌న్మార్ ప్రభుత్వాల‌తో చ‌ర్చించాల‌ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కోరారు. టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేశవరావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారితో కలిసి ఆయన కేంద్రమంత్రిని ఢిల్లీలో కలిశారు. రోహింగ్యాల సమస్యపై కేంద్రం దృష్టి పెట్టాలని కోరారు.

మ‌యన్మార్ లో రోహింగ్యాల‌కు ర‌క్షణ లేకుండా పోయిందని మహమూద్ అలీ అన్నారు. రోహింగ్యా ముస్లింల‌పై జ‌రుగుతున్న హింసాకాండ‌తో ప్రపంచంలో మ‌య‌న్మార్ పేరు ప‌డిపోయిందని చెప్పారు. రోహింగ్యాల అంశాన్ని ప్రధాని న‌రేంద్ర మోడికి వివ‌రించాల‌ని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ను కోరామని అలీ వెల్లడించారు. రోహింగ్యాల రక్షణకు ప్రధాని మోడి మ‌య‌న్మార్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల‌ని విజ్ఞప్తి చేశామన్నారు. మ‌య‌న్మార్ లో జరుగుతున్న మ‌త‌దాడుల‌తో ఇండియాలో ఉన్న రోహింగ్యాలు సైతం ఆందోళ‌న చెందుతున్నారని మహమూద్ అలీ చెప్పారు.

ఆ తర్వాత సౌదీ అరేబియా రాయ‌బారి, బంగ్లాదేశ్ హై క‌మిష‌న‌ర్ లను ఉప ముఖ్యమంత్రి మ‌హ‌మూద్ అలీ కలిశారు. రోహింగ్యాలపై జ‌రుగుతున్న దాడుల‌పై వారికి వివరించారు.  రోహింగ్యాల‌కు త‌గిన న్యాయం జ‌రిగేలా సౌదీ, బంగ్లాదేశ్ లు కృషి చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. హైద‌రాబాద్ లో సౌదీ అరేబియా రాయ‌బార కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని ఈ సందర్భంగా సౌదీ అరేబియా రాయ‌బారిని కోరినట్టు మహమూద్ అలీ వెల్లడించారు.